Bhagavanth Kesari 2 | వరుస విజయాలతో టాలీవుడ్లో తిరుగులేని సక్సెస్ రేట్‌ను కొనసాగిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన తదుపరి ప్రాజెక్టులపై తాజాగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 360 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ భారీ విజయం అందించిన జోష్‌తో ఉన్న అనిల్, నందమూరి బాలకృష్ణతో తాను గతంలో చేసిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాలయ్య అభిమానుల నుండి వస్తున్న విపరీతమైన అభ్యర్థనల మేరకు ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ప్రీక్వెల్ లేదా సీక్వెల్ రూపొందించే ఆలోచనలోతాను ఉన్నట్లు అనిల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ పాత్ర పోలీస్ ఆఫీసర్‌గా మారకముందు అతని గత జీవితం ఎలా ఉండేది, ఆ క్యారెక్టర్ వెనుక ఉన్న అసలు సంఘర్షణ ఏమిటి అనే అంశాలతో కూడిన ప్రీక్వెల్ కథ సిద్ధం చేస్తే అది మరో స్థాయిలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన కెరీర్లోనే ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్న అనిల్ రావిపూడి, బాలయ్య బాబును సరికొత్త మాస్ కోణంలో చూపించేందుకు కథా చర్చలు జరుపుతున్నట్లు తెలపడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.