Bhadrakaali OTT |తమిళ నటుడు విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భద్రకాళి. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా.. విజయ్ ఆంటోని నిర్మించారు. గత నెల 19న ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే థియేటర్లో నిరాశ పరిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ నెల 24 నుంచి తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, కిరణ్, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. విజయ్ ఆంటోని కార్పోరేషన్, రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్స్, స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ ఆంటోని నిర్మించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఖమ్మం జిల్లాలో అనాథగా పెరిగిన కిట్టూ (విజయ్ ఆంటోని) తెలుగు రాజకీయాల్లో పైరవీలు, లాబీయింగ్ చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తుంటాడు. తన అసాధారణ ప్రతిభతో అసాధ్యమైన పనులను సైతం సులభంగా పూర్తిచేసి కోట్లు కూడబెడుతుంటాడు. అయితే కిట్టూ ఎదుగుదలను చూసిన రాజకీయ వ్యూహకర్త, పారిశ్రామికవేత్త అయిన అభ్యంకర శంకర్ (సునీల్ కృపాలనీ) అతడిపై 100కు పైగా కేసులు పెట్టి అక్రమంగా సంపాదించిన రూ. 6,236 కోట్లను సీజ్ చేసి అతన్ని జైలులో వేస్తాడు. అయితే అసలు కిట్టూ ఎవరు? అతని గతం ఏంటి? పైరవీకారుడిగా ఎందుకు మారాడు? అభ్యంకర్తో అతనికి ఉన్న పగ ప్రతీకారాలు ఏమిటి? లక్షల కోట్లు సంపాదించిన డబ్బును కిట్టూ ఏం చేశాడు? అభ్యంకర్ కలలను ఎలా కూల్చాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ భద్రకాళి సినిమా.