Betting | సమాజాన్ని పట్టి పీడిస్తున్న బెట్టింగ్ యాప్ల వ్యసనం గురించి విశ్లేషిస్తూ.. దాని పర్యవసానాన్ని వివరిస్తూ.. ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపుతూ దర్శక, నిర్మాత అల్లాణి శ్రీధర్ తెరకెక్కించనున్న సినిమా ‘బెట్టింగ్’. ‘ఈ ఆటకు అంతం లేదా’ అనేది ఉపశీర్షిక. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అగ్ర నిర్మాత సి.కల్యాణ్ సమర్పకుడు. ఉగాది పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా మొదలైంది. భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథగా, ఆత్మ విమర్శను కలిగించే ప్రేమకథగా, సమాజానికి ఆయుధంగా నిలిచే సందేశాత్మక కథగా ఈ సినిమా రూపొందిస్తున్నామని అల్లాణి శ్రీధర్ తెలిపారు. ఒకే షెడ్యూల్తో సినిమాను పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు.