ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ ’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత పోరాటఘట్టాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన చిత్రాలను ఈ విభాగం క్రింద ఎంపిక చేయనున్నారు. ఈ కేటగిరీ అనౌన్స్మెంట్ సందర్భంగా ఆస్కార్ కమిటీ.. ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రాలతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో కూడిన పోస్టర్‌ను సోషల్‌మీడియాలో పంచుకుంది.
2028లో ఆస్కార్ వందేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకొని ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ కేటగిరీలో తొలి అవార్డును అందించనున్నారు. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో ఆస్కార్ కమిటీ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ‘వందేళ్ల నిరీక్షణ తర్వాత ఆస్కార్ కమిటీ ‘స్టంట్ డిజైన్’ విభాగంలో అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇదొక చారిత్రాత్మక సందర్భం. ఈ కేటగిరీ కోసం కృషి చేసిన స్టంట్ కమ్యూనిటీకి, ఆస్కార్ కమిటీకి నా కృతజ్ఞతలు. అన్నింటికంటే ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన యాక్షన్ విజువల్స్‌ను అనౌన్స్మెంట్ పోస్టర్లో జత చేయడం థ్రిల్లింగ్‌గా అనిపించింది’ అని రాజమౌళి పేర్కొన్నారు.