Bellamkonda Srinivas | టాలీవుడ్లో యువ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు తాజాగా విడుదలైన ‘కిష్కిందపురి’ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందించింది. వివిధ జానర్లలో సినిమాలు చేస్తూ వెళ్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.. గతంలో ‘జయ జానకి నాయక’తో యాక్షన్ ఎంటర్టైనర్గా, ‘రాక్షసుడు’తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ‘కిష్కిందపురి’తో హారర్ జానర్లో అదరగొట్టారు.
సెప్టెంబర్ 12న విడుదలైన ‘కిష్కిందపురి’ చిత్రం మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి టాలీవుడ్లో ఒక సంచలనంగా నిలిచింది. పక్కా హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మౌత్ టాక్ బాగా కలిసొచ్చింది. మొదటి రోజు 50 వేల టికెట్లు అమ్ముడవగా.. రెండో రోజు ఏకంగా 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇటీవలి కాలంలో టాలీవుడ్లో హారర్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. అలాంటి సమయంలో ‘కిష్కిందపురి’ మంచి కథ, కథనంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పవచ్చు. సినిమా కథనంలో అనవసరమైన హంగులు లేకుండా అనుకున్న పాయింట్‌ను స్పష్టంగా తెరపై చూపించడంలో చిత్ర బృందం సక్సెస్ అయింది.
ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా ఆరంభం నుంచి క్లైమాక్స్ వరకు సినిమాను తన భుజాలపై మోశారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రీమియర్ల నుంచి హౌస్‌ఫుల్ షోల వరకు బెల్లంకొండ చురుగ్గా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బెల్లంకొండ.. తన తదుపరి సినిమాలు ‘టైసన్ నాయుడు’ మరియు ‘హైందవ’ కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తాయని తెలిపారు. ఈ రెండూ వేర్వేరు జానర్లలో ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు. నేడు వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ‘కిష్కిందపురి’ హౌస్ ఫుల్ షోలతో దూసుకుపోతోంది.