తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెల్లంకొండ సురేష్. ఆయన ఖాతాలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలున్నాయి. నిర్మాతగా 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నారాయన. నేడు బెల్లంకొండ సురేష్ జన్మదినం. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఇదొక అద్భుతమైన ప్రయాణం. శ్రీహరి నటించిన ‘సాంబయ్య’ సినిమాతో నిర్మాతగా మారాను. ఇప్పటికీ 38 సినిమాలు చేశా. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది. పరిశ్రమలో నాకంటూ మంచి గుర్తింపు దక్కింది. ఏప్రిల్ నుంచి మళ్లీ సినిమాలను మొదలుపెట్టబోతున్నా. తొలుత మా అబ్బాయి బెల్లంకొండ సాయిశ్రీనివాస్తో సినిమా ఉంటుంది’ అన్నారు. నిర్మాతగా తొమ్మిదేళ్లు గ్యాప్ రావడానికి గల కారణాలను వివరిస్తూ ‘ఇద్దరబ్బాయిలు సినిమాలు చేస్తున్నారు. అందుకే నిర్మాతగా గ్యాప్ తీసుకున్నా. పెద్దబ్బాయి సాయిశ్రీనివాస్ కెరీర్ బాగా సెట్ అయింది. ఇక చిన్నబ్బాయి ఇప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏప్రిల్లో వారిద్దరితో సినిమాలు స్టార్ చేయబోతున్నా. ఆ సినిమాల వివరాలను త్వరలో వెల్లడిస్తా’ అని తెలిపారు. నిర్మాతగా గ్యాప్ వచ్చినా సినిమా ప్రొడక్షన్కు దూరం కాలేదని, హిందీ ‘ఛత్రపతి’ సినిమా నిర్మాణ పర్యవేక్షణ మొత్తం తానే చేశానని, ఫిల్మ్ ప్రొడక్షన్లో చాలా మార్పులొచ్చాయని బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. ‘నా ఆటోగ్రాఫ్’ చిత్రాన్ని 4కేలో రెడీ చేశామని, రవితేజ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నామని, అలాగే బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేయాలనుందని, అవకాశం వస్తే మళ్లీ బాలకృష్ణగారితో సినిమా చేస్తానని బెల్లకొండ సురేష్ తెలిపారు.