గణేష్ బెల్లంకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వర్ష బొల్లమ్మ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా శనివారం ఈ చిత్ర ఫస్ట్గ్లింప్స్ను విడుదలచేశారు. ‘నువ్వు వర్జినేనా’ అని కథానాయిక అడిగిన ప్రశ్నకు హీరో సమాధానం కోసం తడబడే సన్నివేశాలతో ఈ వీడియో ఆద్యంతం సరదాగా సాగింది. గోదావరి యాసలో రావురమేష్ చెప్పిన సంభాషణలు నవ్విస్తున్నాయి. “స్వాతిముత్యం’లాంటి ఓ యువకుడి కథ ఇది. జీవితం, ప్రేమ, పెళ్లి విషయాల్లో అతడికి ఎదురైన అనుభవాలు నవ్వుల్ని పంచుతాయి. కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నాం. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. సీనియర్ నరేష్, రావురమేష్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి
స్వరసాగర్.