Vijay | తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఈ నిర్ణయం ఆయన ఉన్నట్టుండి తీసుకున్నది ఏమీ కాదు. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి విజయ్ రాజకీయాలకు వస్తాడు అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆయన బాగానే చేసుకున్నాడు. మూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అభిమాన సంఘాల నాయకులతో కలుస్తూనే ఉన్నాడు విజయ్. ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే తర్వాత ఏం చేయాలి.. ప్రణాళికలు ఎలా ఉండాలి.. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలను అభిమానులతో కూర్చొని ఆయన ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నాడు.
ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఎలా మారుతాయి.. ప్రజలు సపోర్ట్ చేస్తారా లేదా.. అనే ఎన్నో ప్రశ్నలు కూడా ఆయన తలలో తానే అంతర్మదనం చేసుకున్న తర్వాతే రాజకీయ అరంగేట్రం చేశాడు. ఎందుకంటే రజనీకాంత్ లాంటి దిగ్గజ హీరో కూడా పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత వద్దు అని వెనకడుగు వేశాడు. అలాగే కమల్ హాసన్ ఒక్క సీటు కూడా గెలవకుండా అవమానం పాలయ్యాడు. ఇలాంటి సందర్భంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. కోలీవుడ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు.. ఎందుకు ఈయనకు.. రాజకీయాలు అవసరమా.. పవన్ కళ్యాణ్ లాంటి హీరోను చూసిన తర్వాత కూడా విజయ్ ఏం నేర్చుకున్నాడు అంటూ ఎవరికి వారు సలహాలు ఇస్తున్నారు. కానీ విజయ్ లెక్కలు మాత్రం వేరే ఉన్నాయి.
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే తమిళ ఇండస్ట్రీ చాలా డిఫరెంట్. అక్కడ అభిమానులు కూడా హార్డ్ కోర్ ఉంటారు. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా లెక్క చేయని అభిమానం వాళ్ల సొంతం. అందుకే సినిమా వాళ్లకు రాజకీయాలలో ఎక్కడా లేనంత సక్సెస్ రేట్ తమిళనాడులో ఉంది. మన దగ్గర కేవలం ఎన్టీఆర్ మాత్రమే రాజకీయాల నుంచి వెళ్లి సక్సెస్ అయ్యారు. చిరంజీవి ప్రభావం చూపించినా కూడా గెలవలేకపోయారు. ఇక పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నాడు. కానీ తమిళనాడులో మాత్రం అలా కాదు.
అన్నాదొరై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయ్ కాంత్ ఇలా చాలామంది సినిమా వాళ్లు రాజకీయాలలో చక్రం తిప్పారు. అదే నమ్మకం ఇప్పుడు విజయ్ లో కూడా కనిపిస్తుంది. దానికి తోడు ఆయన మాట అంటే శాసనంగా భావించే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. ఈ నమ్మకంతోనే ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్ టార్గెట్గా చేసుకుని పార్టీని అనౌన్స్ చేశాడు. ప్రస్తుతానికి పార్లమెంట్ ఎలక్షన్స్ పై దృష్టి పెడుతున్న విజయ్.. తర్వాత 2026 అసెంబ్లీ ఎన్నికలను కూడా టార్గెట్ చేయబోతున్నాడు.
దానికి తోడు సినిమాలు మానేయాలి అని నిర్ణయం కూడా తీసుకోవడంతో అభిమానులు మరింత కంగారు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాదిరి ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు చేయొచ్చు కదా అన్నా కూడా.. ఆయన మాత్రం లేదు.. ఏదో ఒక పడవ మీద మాత్రమే కాళ్లు పెడతాను అంటున్నాడు. ఏదేమైనా విజయ్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కూడా సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువగానే ఉందని సర్వేలు తేలిన తర్వాతే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి.