జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి స్టార్ హీరో స్థాయికి ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి. ఆయన కెరీర్‌ని ఆసాంతం చూసిన వారికి నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తారాయన. స్టార్‌గా కంటే నటుడిగా ఎదగడానికే ఎక్కువ ఆసక్తిని కనపరుస్తారు విజయ్‌సేతుపతి. ఆయన నటించిన 49 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చాలానే ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తావించారు విజయ్‌సేతుపతి. ‘మల్టీస్టారర్లు చేసి నిజంగా విసిగిపోయాను. వాటివల్ల కొన్ని చేదు అనుభవాలను కూడా చవిచూశాను. అటువంటి సినిమాల్లో మనం ఎంత శ్రమించినా వృధానే. అందుకే ఇక మల్టీస్టారర్లు చేయను. విలన్ పాత్రల్లో కూడా నటించను. ఈ మధ్య విలన్‌గా చాలా ఆఫర్లు వచ్చాయి. అన్నింటినీ తిరస్కరించా.’ అని తెలిపారు విజయ్ సేతుపతి. ఇంకా చెబుతూ ‘నాకు రొమాంటిక్ ప్రేమకథలంటే ఇష్టం. అలాంటి కథలతో ఎవరైనా వస్తారేమో చూస్తున్నా.’ అన్నారు విజయ్ సేతుపతి. ఆయన 50వ సినిమా ‘మహారాజ’ ఈ నెల 14న విడుదల కానుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి నిథిలన్ దర్శకుడు. అనురాగ్ కశ్యప్, అభిరామి, మమిత బైజు కీలక పాత్రధారులు.