Beast Telugu Trailer | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పరిచయం అక్కర్లేని పేరు. ‘తుపాకీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంతో తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలై మంచి విజయాలను సాధిస్తుంటాయి. ఈయన గత చిత్రం ‘మాస్టర్’ తెలుగులో 14కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచింది. ప్రస్తుతం ఈయన నటించిన ‘బీస్ట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘డాక్టర్’ ఫేం నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను నమోదు చేశాయి. ఇటీవలే చిత్ర నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో నాలుగు కోట్ల వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్ర తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ఉదయాన్నే బాగా నిద్రపోతున్నా, సడెన్‌గా పదిన్నరకు ఓ ఫోన్.. ఇందులో దారుణమైన విషయమేంటంటే టెరరిస్టుకు గవర్నమెంట్‌కు నేనే పంచాయితి చేయాలంటా’ అంటూ సెల్వారాఘవన్ చెప్పే డైలాగ్స్ తన ఇంటెన్షన్‌ను తెలియజేస్తున్నాయి. ‘ఇంతకంటే పాత బిల్డింగ్ ఏదీ దొరకలేదా.. తుమ్మితేనే కూల్పోయేట్టుంది’ అంటూ సెల్వా సీరియస్ సీన్లో కామెడీని పండిస్తున్నాడు. ‘ఈ బ్యాడ్ టైమ్‌లో కూడా గుడ్ న్యూస్ ఎంటంటే ఈ మాల్లో మనవాడు ఉన్నాడు’ అంటూ విజయ్ ఎలివేషన్ అద్భుతంగా ఉంది. వీర రాఘవ పాత్రలో విజయ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం ఒక రేంజ్లో ఉంది. మనోజ్ పరమహంస కెమెరా వర్క్ బాగుంది. ఉగ్రవాదులు మాల్‌ను హైజాగ్ చేస్తే అందులో ఉన్న ప్రజలను విజయ్ ఎలా కాపాడాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్13న ఐదు భాషల్లో విడుదలకానుంది.