Bandla Ganesh | టాలీవుడ్లో కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి, తర్వాత స్టార్ నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన సంఘటనను తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బండ్ల గణేష్, తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టారు. తన మాటల్లో చెప్పాలంటే.. నటిగా మంచి గుర్తింపు పొందిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజే ఈ సంఘటన జరిగిందని గుర్తుచేసుకున్నారు. ఆ రోజు షూటింగ్ స్పాట్లో తాను మరో నటుడితో కలిసి ఒక ప్రముఖ పెద్దమనిషి పక్కన కూర్చున్నానని చెప్పారు. సాధారణంగా ఇండస్ట్రీలో పెద్దలను గౌరవంగా “సార్” అని పిలవడం అలవాటని, తాను కూడా అలాగే మాట్లాడుతుండగా ఊహించని సంఘటన జరిగిందన్నారు.
“ఆయన మంచి వ్యక్తే.. నాకు సహాయం కూడా చేశారు. కానీ ఆ రోజు ఏ మూడ్‌లో ఉన్నారో తెలియదు. నేను ‘సార్.. సార్..’ అని పిలుస్తుండగా ఒక్కసారిగా చెప్పు తీసుకుని నన్ను కొట్టారు. ఆ క్షణం నాకు చాలా అవమానంగా అనిపించింది. నేను వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను” అంటూ బండ్ల గణేష్ వివరించారు. అయితే ఆ సంఘటన తన జీవితాన్ని మార్చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. నేను బలహీనుడిని కాబట్టే నన్ను అలా అవమానించారనిపించింది. బయటకు వచ్చిన తర్వాత నాతో ఉన్న వ్యక్తితో ఒక మాట చెప్పాను.. ఒక రోజు ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తా.. లేదంటే నా పేరు గణేష్ కాదు అని. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది” అని అన్నారు.
ఆ తర్వాత కాలంలో నిర్మాతగా మారి, పలు స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నానని బండ్ల గణేష్ గర్వంగా చెప్పారు. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించానని, అవమానాన్ని విజయంగా మార్చుకున్నానని తెలిపారు. అయితే ఈ కథలో తనను చెప్పుతో కొట్టిన వ్యక్తి పేరు మాత్రం బండ్ల గణేష్ బయటపెట్టలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ఎవరు అనే అంశంపై పెద్ద చర్చ మొదలైంది. పలువురు నెటిజన్లు తమ అంచనాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం అసలు విషయం బయటకు వస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అవమానాన్ని ప్రేరణగా మార్చుకుని జీవితంలో ఎదగవచ్చని ఆయన కథ మరోసారి చర్చనీయాంశమైంది.