Balakrishna | సీనియర్ హీరోల్లో బాలకృష్ణ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఒకప్పుడు చిరంజీవి మార్కెట్లో సగం కూడా బాలకృష్ణకు ఉండేది కాదు. ఆయన సినిమా హిట్ అయినప్పుడు మాత్రమే మంచి కలెక్షన్స్ వచ్చేవి. ఫ్లాప్ అయితే కనీసం వసూళ్లు కూడా రాబట్టడం కష్టంగా ఉండేది. అందుకే బాలయ్య కెరీర్లో 10 కోట్లు అంతకంటే తక్కువ షేర్ తీసుకొచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు బాలయ్య మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అన్‌స్టాపబుల్ షో చేసిన తర్వాత ఈయన కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. తద్వారా ఆయనకు మార్కెట్ కూడా బాగా పెరిగింది.
కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎంచుకుంటున్న కథలు.. చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయి. అఖండ సినిమా ఏకంగా 75 కోట్లకు పైగా వసూలు చేస్తే.. వీరసింహారెడ్డి 80 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఈ రెండు సినిమాలో మిక్స్డ్ టాక్ తోనే ఓపెన్ అయ్యాయి. కానీ బాలయ్య ఇమేజ్ సినిమాలను సేఫ్ జోన్లో నిలబెట్టింది. ఇప్పుడు విడుదలైన భగవంత్ కేసరి సినిమాకు కూడా టాక్ యావరేజ్‌గానే వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో ఒకప్పుడు బాలకృష్ణ సినిమాలు వస్తే కనీసం పట్టించుకునే వాళ్ళు కాదు ఆడియన్స్. రొటీన్ సినిమాలు చేస్తాడు అంటూ ఆయన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.
అఖండ సినిమాతో బాలకృష్ణకు ఓవర్సీస్ మార్కెట్ ఓపెన్ అయింది. ఆ సినిమా 1.2 మిలియన్స్ పైగా వసూలు చేసింది. దానికి ముందు గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రమే బాలకృష్ణకు ఓవర్సీస్ లో ఉన్న వన్ మిలియన్ సినిమా. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమా కనీసం ఆఫ్ మిలియన్ కూడా క్రాస్ కాలేదు. అఖండతో మళ్లీ వన్ మిలియన్ అందుకున్నాడు బాలయ్య. ఆ తర్వాత అన్ స్టాపబుల్ రికార్డ్స్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా భగవంత్ కేసరి కూడా నాలుగు రోజుల్లోనే ఓవర్సీస్లో వన్ మిలియన్ క్రాస్ చేసింది. సీనియర్ హీరోల్లో వరుసగా మూడు సినిమాలు వన్ మిలియన్ అందుకున్నది బాలయ్య మాత్రమే. ఈ రికార్డు చిరంజీవికి కూడా సొంతం కాలేదు.
ప్రస్తుతం ఆయన ఉన్న ఫామ్ చూస్తుంటే ఈ జోరు ఇంకా కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో బాలయ్య మరిన్ని రికార్డులు సెట్ చేస్తాడు అనిపిస్తుంది. ఈయన నెక్స్ట్ సినిమా బాబీతో ఉండబోతుంది. ఇది కూడా పూర్తిగా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్. దసరా తర్వాత షూటింగ్ మొదలు కాబోతుంది. మొత్తానికి సీనియర్ హీరోల్లో బాలకృష్ణ అందరికంటే ముందున్నాడిప్పుడు.