సినిమా: డాకు మహారాజ్
తారాగణం:నందమూరి బాలకృష్ణ, బాబీడియోల్, ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్..
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబి)
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య
నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్
ఇప్పటికే వరుసగా మూడు హిట్లు.. హ్యాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న బాలకృష్ణ సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దానికి తగ్గట్టు దర్శకుడు బాబీ ప్రీవియస్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ కూడా పెద్ద బ్లాక్‌బస్టర్. ఇక సితార ఎంటైర్టెన్మెంట్స్ గురించి సరేసరి. విజయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిందా సంస్థ. ఇన్ని అడ్వాంటేజస్తో ఈ ఆదివారం విడుదలైంది బాలకృష్ణ ‘డాకు మహారాజ్’. ప్రచారంలో భాగంగా ఈ సినిమా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు స్థాయి హిట్ అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియా సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఆయన నమ్మకాన్ని ‘డాకు మహారాజ్’ నిజం చేశాడా? బాలయ్య వరుస విజయాల విహారం కొనసాగిందా? చిరంజీవితో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన బాబీ.. బాలకృష్ణతో కూడా బ్లాక్‌బస్టర్ ఇవ్వగలిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
విద్యావేత్త, ఓ పెద్ద స్కూల్‌కి అధినేత అయిన కృష్ణమూర్తి(సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు(రవి కిషన్) లీజుకు తీసుకుంటాడు. అయితే.. అక్కడ తోటను పండించకుండా వన్యప్రాణులను చంపి వాటి శరీరాలతో వ్యాపారం చేస్తుంటాడు. ఈ విషయం తెలిసిన కృష్ణమూర్తి పోలీసులను ఆశ్రయిస్తాడు. త్రిమూర్తులుపై కేసు పెడతాడు. దాంతో కృష్ణమూర్తిపై పగబట్టిన త్రిమూర్తులు.. కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెడతాడు. కృష్ణమూర్తి ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి(మకరంద్ దేశ్‌పాండే) ఆ విషయాన్ని పసిగట్టి వెంటనే.. చంబల్‌లోని మోస్ట్ వాంటెడ్ ‘డాకు మహారాజ్'(బాలకృష్ణ)కు కబురు పంపుతాడు. నానాజీ పేరుతో డాకు మహారాజ్ ఆ ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు.
అసలు ఈ ‘డాకు మహారాజ్’ ఎవరు? వైష్ణవి పాపకు డాకు మహారాజ్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథతో బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్), నందిని(శ్రద్ధా శ్రీనాథ్)కి సంబంధ ఏంటి? అసలు ఆ ఇంట్లోకి నానాజీగా డాకు మహారాజ్ రావాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
కథ పాతదే అయినా.. దాన్ని కొత్తగా చూపిస్తే సినిమా హిట్. ‘డాకు మహారాజ్’ సినిమా విషయంలో అదే జరిగింది. ఇలాంటి కథలు గతంలో బాలయ్య చాలా చేసేశారు. అయితే… ఆయనకు సరిగ్గా సరిపోయే ఫ్యాక్షన్ లైన్‌ని ‘చంబల్ లోయ’ నేపథ్యంగా మార్చేయడంలో సినిమాకు కొత్త కలర్ వచ్చేసింది. నిజానికి ఇది పక్కా మాస్ కథ. కానీ మాస్ కథను క్లాస్‌గా కూడా చూపించొచ్చని ఈ సినిమాతో రుజువు చేశాడు దర్శకుడు బాబీ. ఇందులోని యాక్షన్ సీన్లను విభిన్నంగా హాలీవుడ్ సినిమలను తలపించేలా డిజైన్ చేశాడు. ఆ వైవిద్యమే ‘డాకు మహారాజ్’కి కొత్తదాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలకృష్ణను కొత్తగా చూపిస్తే, ఆయనతో సెటిల్డ్‌గా డైలాగ్ చెప్పిస్తే.. బాలకృష్ణ క్యారెక్టర్‌కి సరైన ఎలివేషన్స్ పడితే.. జనం సినిమా చూసేస్తున్నారు. ప్రస్తుతం ఆయన టైమ్ అలా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణను బాబీ చూపించిన తీరు నిజంగా వండర్. అభిమానులు విజువల్ ఫీస్టే. రజనీకాంత్ ‘జైలర్’, కమల్‌హాసన్ ‘విక్రమ్’ సినిమాల వాసన అక్కడక్కడ అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం ఆడియన్స్‌ని మెప్పిస్తుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ఓపెనింగ్గా చూపించి కథను మొదలుపెట్టిన తీరు నిజంగా ఓ వినూత్న ప్రయత్నం అని చెప్పాలి. నానాజీగా డాకు మహారాజ్ కథలోకి ఎంట్రీ ఇవ్వగానే అప్పటిదాకా కాస్త నిదానంగా నడిచిన కథ ఊపందుకుంది. మరోవైపు స్పెషల్ ఆఫీసర్ స్టీఫెన్‌రాజ్ (షైన్ టామ్ చాకో) డాకు మహారాజ్కోసం అన్వేషించడం కథపై ఆసక్తిని రెట్టింపు చేసింది. తొలిభాగంగా వచ్చే డాకుమహారాజ్ తొలి ఫైట్ సీక్వెన్స్ మాస్‌కి గూజ్పంప్స్ తెప్పించింది. ఇక తర్వాత వచ్చిన ‘దబిడి దిబిడి..’ సాంగ్ థియేటర్లో అభిమానుల్ని డాన్సులు వేయించింది. ఇక ఇంటర్వెల్ బాంగ్ అయితే. అదిరిపోయింది. ఇక ద్వితాయార్థంలో అక్కడక్కడ సినిమా స్లోగా అనిపించినా.. మొత్తానికి ప్రథమార్థానికి ఏమాత్రం తీసుపోదు.
ఇది బాలకృష్ణ వన్‌మ్యాన్ షో. ఆయనతో సెటిల్డ్‌గా పెర్ఫామ్ చేయించి విజయాన్ని అందుకున్నాడు బాబీ. బాలకృష్ణను అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో.. ఇందులో అలా కనిపిస్తారు. ముఖ్యంగా ‘డాకు మహారాజ్’గా ఆయన పెర్ఫార్మెన్స్కి వండర్. ద్వితీయర్థంలో ఠాకూర్ ఇంట్లో జరిగే మారణహోమం ‘సమరసింహారెడ్డి’ ఫ్లాష్‌బ్యాక్‌ని తలపించింది. ఆ సీన్లో బాలయ్య నటవిశ్వరూపమే చూపించారు. ఇక బాబీడియోల్ కూడా బాలయ్యకు ఢీకొట్టేలా నటించారు. ఈ సినిమాలోని పాత్రలన్నీ కథలోనే ఉండటం విశేషం. కథకు పనికిరాని ఒక్క పాత్ర కూడా సినిమాలో లేదు. ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధాశ్రీనాథ్, ఛాందినీ చౌదరి, సచిన్ ఖేడ్కర్.. ఇలా అందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
సాంకేతికంగా ముందు చెప్పుకోవాల్సింది దర్శకుడ్నే. బాబీ ఈ కథకు కథనం రాసుకున్న తీరు, తెరకెక్కించిన విధానం అద్భుతం. చాలా రోజుల తర్వాత పూర్తి మాస్ సినిమాను ఆడియన్స్ చూశారు. బాబీ తర్వాత చెప్పోకోవాల్సింది ఛాయాగ్రణం. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. తాను రజనీకాంత్‌కి ‘జైలర్’కి ఎంత మంచి విజువల్స్ ఇచ్చాడో ఈ సినిమాక్కూడా అంత మంచి విజువల్స్ ఇచ్చాడు. ఇక తమన్ పాటలు, రీరీకార్డింగ్ మరోసారి బాక్సులు బద్దలయ్యేలా ఉంది. మొత్తానికి సాంకేతికంగా కూడా అన్ని విధాలా సినిమా బావుంది. మొత్తంగా బాలయ్య అభిమానులు మెచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా ఎంత బావున్నా.. తర్వాత వచ్చే ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిజల్ట్‌ని బట్టి, ఈ సినిమా సక్సెస్ పర్సెంటేజ్‌ను చెప్పగలం తప్ప.. ఇప్పుడే చెప్పలేం. మొత్తంగా ‘డాకు మహారాజ్’ అభిమానులకు విందుభోజనం లాంటి సినిమా.
+ బాలకృష్ణ అభినయం,
+ కథనం,
+ కెమెరా,
+ తమన్ ఆర్ఆర్..
– సెకండాఫ్‌లో ఓ అరగంటపాటు కాస్త నిదానం..
రేటింగ్: 3/5