Waheeda Rehman | బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు వహీదా రెహమాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ వహీదాకు అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. ‘పాత్ర ఏదైనా పరకాయం ప్రవేశం చేసి, అత్యంత సహజంగా అభినయించే దిగ్గజ నటి వహీదా రెహమన్. ఆవిడ నాన్నగారి జయసింహా సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించారు. ఈ పురస్కారం వరించడం ఆనందదాయకం’ అని వెల్లడించాడు.
ఇక ఈ ఏడాదికి గాను వహీదా రెహమాన్‌కు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బహూకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వహీదా రెహమాన్ వయసు 85 ఏళ్లు. 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో వహీదాకు ఫాల్కే అవార్డును అందజేయనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీలోని అయిదుగురు సభ్యులు వహీదా రెహమాన్ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదవి కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషి, ఢిల్లీ 6 (Delhi 6) వంటి చిత్రాలతో వహీదా రెహమాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిసారిగా కమల్ హాసన్ విశ్వరూపం, స్కేటర్ గర్ల్ సినిమాలో వహీదా అతిథి పాత్రలో మెరిసింది.