అగ్ర హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేశారు.
కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘మునుపెన్నడూ చూడని విధంగా బాలకృష్ణను సరికొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఆయన అభిమానుల్ని అలరిస్తుంది. బాలకృష్ణ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు అనిల్ రావిపూడి పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు. గురువారం రోజునే యాక్షన్ ఘట్టాలతో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెడుతున్నాం.
ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ నేతృత్వంలో ఫైట్స్ కోసం భారీ సెట్ నిర్మించాం’ అని చిత్రబృందం పేర్కొంది. యువ నాయిక శ్రీలీల కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: తమన్, ఫైట్స్: వి.వెంకట్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.