అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ – తాండవం’ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు ఇది సీక్వెల్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ఒకటి వెలుగు చూసింది.
‘అఖండ’లో బాలయ్య డ్యూయెల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్లోనూ అది కొనసాగుతుందట. అందుకే బోయపాటి ఓ ప్లాన్ ప్రకారం.. తొలుత అఘోరా పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తిచేసే పనిలో ఉన్నారట. అందుతున్న సమచారం మేరకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మినహా అఘోరా పార్ట్ అంతా కంప్లీట్ అయినట్టు తెలుస్తున్నది.
దానికి బలాన్నిస్తూ.. రీసెంట్గా ‘ఆదిత్య 369’ రీరిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ క్లీన్ షేవ్‌తో కనిపించారు. మిగిలిన యాక్షన్ సన్నివేశాలను బాడీ డబుల్స్‌తో కానిచ్చేస్తారట. ఇక రెండో బాలకృష్ణ పాత్రకు సంబంధించిన షూట్ త్వరలోనే మొదలుకానున్నదట. జూన్ నాటికి మొత్తం టాకీని కంప్లీట్ చేస్తారని తెలుస్తున్నది. తమన్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న విషయం తెలిసిందే.