Yellamma | చిన్నసినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘బలగం’ (Balagam). తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం (డెబ్యూ) వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు.
అయితే ఈ సినిమా అనంతరం అందరిచూపు దర్శకుడు వేణుపై పడిన విషయం తెలిసిందే. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. తన తర్వాతి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ (Yellamma) అంటూ అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ‘ఎల్లమ్మ’ అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఎవరు లీడ్ రోల్ చేయబోతున్నారు అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు దర్శకుడు వేణు. మీడియాతో మాట్లాడుతూ..
”బలగం సినిమా హిట్ అయిన తర్వాత నా బాధ్యత మరింత పెరిగింది. అయితే అందరూ అనుకున్నట్లే బలగం తర్వాత వేణు ఏం తీస్తున్నాడు అనే ఒత్తిడి అయితే ఉంది. ఆ ప్రెషర్నే బాధ్యతలాగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా వలన అందరూ ఫస్ట్ నన్ను ప్రేమించారు. ఇప్పుడు గౌరవిస్తున్నారు. దీన్ని మళ్లీ నిలుపుకోవాలని గ్యాప్ తీసుకుంటున్నాను. అందుకే ఎల్లమ్మ కథ లేట్ అవుతుంది. ఈ సినిమాలో కల్చర్ ఉంటది.. ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాపై న్యూ ఇయర్లో అప్డేట్ ఇస్తాము. దిల్ రాజు గారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు” అంటూ వేణు చెప్పుకోచ్చాడు.