Balagam Review | ఒక్కోసారి జీవితమే సినిమా అనిపిస్తుంది… ఇంకోసారి సినిమా చూస్తుంటే జీవితం అనిపిస్తుంది… సరిగ్గా అలాంటి భావోద్వేగమే బలగం సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. నాలాంటి గ్రామీణ నేపథ్యం, బలహీనవర్గాల బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లకి బలగం సినిమా గట్టిగా కనెక్ట్ అవుతుంది. చిన్నప్పుడు ఆడిన ఆటలు, యాస మరువని మాటలు, అన్నింటికన్నా ముఖ్యంగా ఎన్ని బాధలు ఉన్నా కుటుంబం పట్ల మమకారం, మరోవైపు ప్రతిక్షణం మనల్ని సవాలు చేసి, స్వార్థపరులుగా మార్చే ఈతి భాధలు, కానీ వాటన్నింటినీ తట్టుకొని తిరిగి ఒక స్వచ్ఛమైన సగటు పల్లెటూరి మనిషిగా మారి… మనుషులు, బంధాలే ముఖ్యం అనుకునేలా చేసే మనస్తత్వాలు… టూకీగా చెప్పాలంటే ఇది బలగం సినిమా…
స్వచ్ఛమైన 20 సంవత్సరాల క్రితం నాటి తెలంగాణ పల్లెటూరిని చూడాలంటే బలగం సినిమా చూడొచ్చు. అనేక సందర్భాల్లో కమర్షియల్ సినిమాల ఊబిలో చిక్కుకోకుండా అచ్చమైన తెలంగాణ సినిమా రావాలనుకున్న నాలాంటి వాళ్ళ కల మరొక్కసారి ఈ చిత్రంతో నెరవేరినట్టు అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పల్లెలు మారుతున్నాయి… పట్టణాల్లో అనుక్షణం అడుగడుగునా కనిపించే స్వార్థపరత్వం, సంకుచితత్వం పల్లెలను కూడా మింగివేస్తుంది. పల్లెటూర్ల మానవీయ బంధాలను మహమ్మారిలా తుడిచిపెట్టుతుంది. ఇంటి పెద్ద చావులోనూ ఎవరి స్వార్థం మేరకు వాళ్లు ఆలోచించడం, పైసలు, పంపకాల చుట్టే మనుషుల బూటకపు ప్రేమలు, స్వార్థపు ఆటలు సహజమైపోయాయి. కట్టెకాలకముందే కాసుల పంపిణీ, పంట పొలాల వాటలు సాధారణమైపోయాయి. సరిగ్గా చితిమంటల సాక్షిగా మనసులను కాల్చి వేస్తున్న ఈ స్వార్థపర చింతన పైన బలగం బలమైన ఆస్త్రాన్ని ఎక్కు పెట్టింది. మల్టీప్లెక్స్ సాక్షిగా మనుషులను గట్టిగా ప్రశ్నించింది.
ఇక సినిమా విషయానికి వస్తే సినిమాలో ప్రధాన పాత్రల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అచ్చమైన తెలంగాణ పల్లెటూరి మనుషులుగా మారిపోయారు. ముఖ్యంగా ప్రియదర్శి, సంగీత దర్శకుడు భీమ్ సిసిలీరియో, పాటలు అందించిన కాసర్ల శ్యామ్ ప్రత్యేకంగా అభినందించాలి. సాధారణంగా తెలంగాణ సినిమా అన్నప్పుడు భాష కొంత కృతకంగా ఉంటుంది, ఈ అంశంలో ఈ సినిమా భాష అడ్డంకిని దాటిందని చెప్పవచ్చు. తెలంగాణ పల్లెటూరి జీవితంలో అంతర్భాగమైన జానపదాలను, సంగీతాన్ని, బుర్రకథలను, ఇతర పల్లె కళారూపాలను అద్భుతంగా అవసరం మేరకు వాడుకున్న తీరు బాగుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా క్లైమాక్స్ పైన ప్రత్యేక దృష్టి సారించి విజయం సాధించిన కాంతార వంటి సినిమాల మాదిరి బలగం లోను క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వస్తుంది. ఇంటి పెద్దమనిషి ఆత్మ శాంతి కోసం పెట్టే పిట్ట కూడు కాకి ముట్టకుండా ఇబ్బంది పెట్టి, చివరికి కుటుంబమంతా కలిస్తేనే కూడుముట్టి కుటుంబాన్ని కలిపిన కాకిపిట్ట ఈ సినిమాలో ఒక కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. చివరి పది నిమిషాల పాటు వచ్చే జానపద గీతం, అది మనలో కలిగించే భావోద్వేగం నాకు కాంతారా సినిమా చూసినప్పటి అనుభవాన్ని గుర్తుకుతెచ్చింది. ఈ విషయంలో దర్శకుడు వేణును ప్రత్యేకంగా అభినందించాలి. సినిమాను ముగించే విషయంలో సినిమాటిక్ కమర్షియల్ పద్ధతిలో కాకుండా ఒక షాకింగ్ ఎలిమెంట్‌తో మ్యూజిక్ తో ముగించడం వలన సినిమా థియేటర్ బయటకు వచ్చేటప్పుడు ఒక భావోద్వేగంతో ప్రేక్షకుడు ఇంటికి వెళ్తాడు.
ఇన్నాళ్లపాటు రాయలసీమ, కోస్తా, తెలంగాణ పల్లెటూరి జీవితాలను సినిమాలో చూపించే ప్రతిసారి అందంగా చూపించే ప్రయత్నం జరిగింది. అయితే తొలిసారి పక్కా పల్లెటూరిలో చిత్రీకరించడం వలనో లేదా ఎలాంటి ఆడంబరాలకు పోకపోవడం వలనో పల్లెటూరి సహజత్వం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. నేపథ్యం, మాటలు, పాటలు, పాత్రధారుల కాస్ట్యూమ్స్ ఇలా అన్నింటిలోనూ పల్లెటూరు తెరమీద పక్కాగా కనిపిస్తుంది.
భారీ ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న దిల్ రాజు కుటుంబం ఈ సినిమాను నిర్మించడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక గొప్ప ప్రారంభానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పవచ్చు. చిన్న కథలను సహజమైన పద్ధతిలో ప్రజల ముందుకు తీసుకురావాలంటే పెద్ద సినిమా నిర్మాణ సంస్థల సహకారం ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అత్యవసరం. అయితే నిజాయితీగా ఈ ప్రయత్నాన్ని చేస్తే మలయాళం సినిమాల మాదిరి కమర్షియల్ గాను విజయం సాధించే అవకాశం ఉందని ఈ బలగం సినిమా నిరూపించింది.
చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా తండ్రిని లేదా ఇంటి పెద్దను కోల్పోయిన వ్యక్తులు ఈ సినిమా చూసినప్పుడు పలుసార్లు కళ్లెంబటి నీళ్లు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఒక ఇంటి పెద్దకు బతికినప్పుడు.. చివరికి చనిపోయిన తర్వాత కూడా కుటుంబమంతా కలిసి మెలిసి సుఖంగా ఉండాలన్న ఏకైక ఆశ, తాపత్రయమే పరమావధిగా ఉంటుందని అనిపిస్తుంది. అందుకే మన బలగమే మన బలం అని అనిపిస్తుంది.
-డా. మహేష్ మాణిక్య