Balagam Movie On OTT | ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా ఏమిలేదు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ సినిమా పెద్ద సినిమా రేంజ్లో కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇటీవలే రిలీజైన బలగం మూవీ కూడా ఇదే కోవలోకి చెందింది. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. తొలిరోజుకు మించి రెండోరోజు, మూడోరోజు ఇలా రోజు రోజుకు కలెక్షన్ల ప్రవాహం పెరుగతూనే ఉంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమాను రిలీజ్‌కు రెండు, మూడు రోజుల ముందు నుంచే ప్రీమియర్లు వేసి ఎక్కడలేని హైప్ తీసుకొచ్చారు.
ఓ మోస్తరు అంచనాలతో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మనుషుల భావోద్వేగాలను, పల్లె అందాలను, తెలంగాణ సంసృతిని కళ్లకు కట్టినట్లు చూపించిన వేణు టేకింగ్, విజన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మేయిన్ లీడ్‌తో పాటు నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. ఈ మూవీలోని పాత్రలకు మనం ఇట్టే కనెక్ట్ అయిపోతాం. అంతలా ఈ సినిమా నవ్వించింది. ఏడిపించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కాగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ హీరోయిన్గా నటించింది. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చాడు.