Bala Krishna | ఈ మధ్య ప్రత్యేక సందర్భాలలో పాత సినిమాలని రీరిలీజ్ చేస్తూ ప్రేక్షకులని ఎంతగా ఎంటర్టైన్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా కృష్ణ బర్త్‌డే సందర్భంగా మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం రీరిలీజై ప్రేక్షకులకి మంచి వినోదం పంచింది. ఇక మరి కొద్ది రోజులలో బాలయ్య బర్త్ డే కూడా రానుంది. దాంతో నందమూరి అభిమానులు బాలయ్య నటించిన ఏ సినిమాని రీరిలీజ్ చేయబోతున్నారని ముచ్చటించుకుంటున్నారు. ఈ క్రమంలో అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ బర్త్ డే జూన్ 10 కాగా, ఆ రోజు బాలయ్య సూపర్ హిట్ సినిమాలలో ఒకటైన ‘లక్ష్మీ నరసింహ’ రీ రిలీజ్ అవుతోంది.
బాలయ్య పుట్టిన రోజు కంటే మూడు రోజుల ముందు థియేటర్లలోకి ‘లక్ష్మీ నరసింహ’ సినిమా రానుంది. జూన్ 7వ తేదీన నైజాం (తెలంగాణ)తో పాటు ఉత్తరాంధ్రలో ఈ సినిమాను అగ్ర నిర్మాత ‘దిల్’ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తోంది. లక్ష్మీ నరసింహ చిత్రం జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కగా, ఇందులో బాలయ్య సరసన ఆసిన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తమిళంలో విజయం సాధించిన చియాన్ విక్రమ్ ‘సామి’కి తెలుగు రీమేక్ .. బాలకృష్ణ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథలో, పాటల్లో కొంత మార్పులు చేసి ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు జయంత్.
ఇందులో బాలయ్య డైలాగులకి మంచి క్రేజ్ వచ్చింది. లక్ష్మీ నరసింహ సినిమాని రీ రిలీజ్ చేయాలని ఎప్పటి నుండో అభిమానులు కోరుతుండగా, ఈ సారి బాలయ్య బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక బాలయ్య ప్రస్తుతం ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను తనకు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన రిలీజ్ కానుందని అభిమానులు భావిస్తున్నారు. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నా ఇది డిసెంబర్‌కి పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది.