Badmashulu | సిరిసిల్ల టౌన్, జూన్ 1: కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన చిత్రం ”బద్మాషులు” అని మూవీ డైరెక్టర్ శంకర్ చేగూరి అన్నారు. సినిమాలో హాస్యంతోపాటు గ్రామీణ నేపథ్యం ఉంటుందన్నారు. ఈ మేరకు బద్మాషులు చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం సిరిసిల్లలో సందడి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శంకర్ చేగూరి సినిమాకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
బద్మాషులు సినిమా బలగం లాంటి ఫీల్ గుడ్ మూవీ అన్నారు. హీరోలుగా మహేశ్ చింతలతోపాటు సిరిసిల్లకు చెందిన కారంపురి విద్యాసాగర్‌లు నటించారని తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్లు అందరూ ఎటువంటి బూతులు లేని ఈ సినిమాను సరదాగా చూడవచ్చునని చెప్పారు. సిరిసిల్లకు సినిమా ప్రమోషన్‌కు వచ్చిన సందర్భంగా మీరు ఆదరించిన తీరు సంతోషంగా ఉందన్నారు.
బలగం సినిమాకు తక్కువ కాకుండా బద్మాషులు సినిమా ఉంటుందన్నారు. ఈ నెల 6న తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌లోని థియేటర్లలో సినిమా విడుదల కానుందని చెప్పారు. చిన్న సినిమాను ఆదరించి విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రేక్షక దేవుళ్లపై ఉందన్నారు. హీరోలుగా నటించిన చింతల మహేశ్, కారంపురి విద్యాసాగర్‌లు మాట్లాడుతూ సినిమా 2గంటల పాటు హాస్యంతో అలరిస్తుందన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాను చూడవచ్చునని తెలిపారు.
ప్రేక్షకులు తమ సినిమాను మీ సినిమాలా భావించి ఆదరించాలని కోరారు. ఈ నెల 6న థియేటర్‌కు వెళ్లి సినిమాను విజయం అందించాలన్నారు. ఈ సమావేశంలో ఆకునూరి దేవయ్య, నక్క శ్రీకాంత్, గజ్జెల అశోక్, తదితరులున్నారు.