నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న పాపులర్ షో ‘ది బిగ్‌బ్యాంగ్ థియరీ’ వివాదాల్లో చిక్కుకుంది. రెండో సీజన్‌లోని తొలి ఎపిసోడ్లో బాలీవుడ్ సీనియర్ నటి మాధురిదీక్షిత్ను కించపరిచేలా అసభ్యపదజాలంతో డైలాగ్ ఉందని రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్‌కుమార్ నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఓ సన్నివేశంలో మాధురిదీక్షిత్ను వేశ్య అంటూ సంభోదించడం ఆక్షేపణీయమని మిథున్ విజయ్‌కుమార్ తన నోటీసులో పేర్కొన్నారు.
‘ఈ ఎపిసోడ్ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉంది. భారతీయ సమాజం ఇలాంటి చర్యలను ఏమాత్రం క్షమించదు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసే ముందు నైతిక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. నెట్‌ఫ్లిక్స్ వెంటనే ఆ ఎపిసోడ్‌ను తీసివేయాలి’ అని మిథున్ విజయ్‌కుమార్ తెలిపారు. తన నోటీసులపై నెట్‌ఫ్లిక్స్ స్పందించక పోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన హెచ్చరించారు.