Baby Movie On Ott | ఈ మధ్య కాలంలో ఒక సినిమా వీక్ ఆడితే చాలు అదో పెద్ద సంచలనం. ఇక రెండు వారాలు ఆడిందంటే అది బంపర్ హిట్టే. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అయితే చిన్న సినిమాగా విడుదలైన బేబి మాత్రం సంచలనం అనే మాటను కూడా దాటుకొని వెళ్లింది. పట్టుమని పది కోట్ల బడ్జెట్ కూడా లేని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.90 కోట్ల మార్కును దాటేసింది. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఆ నమ్మకమే నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. ఇక ఓటీటీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
తాజాగా ఆహా సంస్థ ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసింది. ఆగస్టు 25న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లకు 12గంటల ముందు నుంచే సినిమా అందుబాటులో ఉండనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకుడు. ఇప్పుడున్న జెనరేషన్లో లవ్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా ఉందనే విధంగా సినిమాను తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ దీని పట్ల అంత సుముఖంగా లేనప్పటికీ కాలేజీ కుర్రకారుతో పాటు ఆటో మాస్ జనాలు రిపీటెడ్ షోలు వేసి అరవీర భయంకర హిట్‌ను చేసేశారు. ఇక డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ మధ్య కాలంలో ఇంత లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏది లేదని తెగేసి చెబుతున్నారు.