Avika Gor | చిన్నారి పెళ్లికూతురు (బాలికా వధు) సీరియల్‌తో పరిచయమై దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ (Avika Gor) ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓ టీవీ రియాలిటీ షోలో భాగంగా తన ప్రియుడు మిళింద్ చంద్వాని(Milind Chandwani)తో కలిసి ఏడడగులు వేసింది. అయితే టీవీ రియాలీటీలో షోలో అవికా పెళ్లి చేసుకోవడంతో ఈ జంటపై సోషల్ మీడియా నుంచి విమర్శలు వస్తున్నాయి. అవికా పెళ్లిని తప్పుబడుతూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా అవికా స్పందించింది. టీవీ షోలో పెళ్లిచేసుకోవడం అనేది తన చిన్ననాటి కోరిక అని.. ఇందులో తన భర్త మిళింద్ చంద్వాని (Milind Chandwani) అభిప్రాయమే తనకు ముఖ్యమని, ఇతరుల విమర్శలను తాను పట్టించుకోనని ఆమె తేల్చి జెప్పింది.
అవికా మాట్లాడుతూ.. టీవీ కార్యక్రమంలో పెళ్లి చేసుకోవాలనే నా నిర్ణయాన్ని మిళింద్‌కు చెప్పినప్పుడు తను అంగీకరించాడు. అయితే ప్రజలు విమర్శిస్తారు డబ్బు కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వస్తాయని ముందే నాకు తెలిపాడు. కానీ నా నిర్ణయంపై మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. మిళింద్ అంగీకరించడమే నాకు ముఖ్యం జనాల గురించి నేను పట్టించుకోను. నా పెళ్లి మొత్తం సంప్రదాయబద్ధంగా జరిగింది. అందుకే కొందరు నా వెడ్డింగ్ లుక్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ట్రోల్స్ నా భర్త లుక్స్‌పై వచ్చి ఉంటే నేను బాధపడేదాన్ని. ఎందుకంటే ఆయన లుక్‌ను నేనే డిజైన్ చేశాను. అలా రానందుకు ఆనందంగా ఉందంటూ చెప్పుకోచ్చింది.
మరోవైపు రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవడంపై వచ్చిన విమర్శలను ఉద్దేశిస్తూ అవికా భర్త మిళింద్ చంద్వాని కూడా స్పందించారు. ఈ రోజుల్లో కనీసం 50 మంది ఫొటోగ్రాఫర్లు, వీడియో రికార్డ్ చేసేవారు లేకుండా ఏ పెళ్లి జరగడం లేదు. అందరి పెళ్లిళ్లలో ఇలాంటివి కామనే. అవికా మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది మిళింద్ వివరించాడు.