Avatar | ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లిన సినిమాల జాబితాలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఫ్రాంచైజ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2009లో విడుదలైన అవతార్‌తో ప్రారంభమైన ఈ ఎపిక్ విజువల్ వండర్, సినిమా చరిత్రనే మార్చేసింది. నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అందించిన తొలి రెండు భాగాల తర్వాత, తాజాగా విడుదలైన అవతార్ పార్ట్ 3 కూడా బాక్సాఫీస్ వద్ద స్థిరంగా దూసుకుపోతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే విడుదలైన మూడు అవతార్ సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా 5.6 బిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో, ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ రికార్డుతో అవతార్ ఫ్రాంచైజ్ ప్రపంచ సినీ చరిత్రలో విడుదలైన అన్ని ఫ్రాంచైజ్‌లు, ట్రయాలజీలను దాటుకుని ఆల్‌టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫ్రాంచైజ్‌గా నిలిచింది. అవతార్ తర్వాతి స్థానాల్లో స్టార్ వార్స్, జురాసిక్ వరల్డ్, స్పైడర్‌మ్యాన్, ది హాబిట్ ట్రయాలజీ వంటి భారీ ఫ్రాంచైజ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అద్భుతమైన విజువల్స్, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ, ఎమోషనల్ స్టోరీటెల్లింగ్‌తో జేమ్స్ కేమెరూన్ మరోసారి తన ముద్ర వేసారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ వద్దనూ, ప్రేక్షకుల ఆదరణలోనూ ‘అవతార్’ టాప్ పొజిషన్లోనే కొనసాగుతుండటం విశేషంగా మారింది.
అవతార్ ఫస్ట్ పార్ట్ 2009లో రిలీజయినప్పుడు చాలా కొత్తగా, వింతగా ఉండటం, స్టోరీ కూడా కొత్తగా అనిపించడంతో మూవీ సూపర్ హిట్ అయింది. ఆ సమయంలో సీక్వెల్స్ ఉంటాయని కూడా ప్రకటించారు. పార్ట్ 2 సినిమా 2022 లో రిలీజయినప్పుడు కథ పరంగా సింపుల్ గా ఉన్నా విజువల్స్ తో మెప్పించి అలరించారు. ఇప్పుడు పార్ట్ 3 రిలీజయి మోస్తరు ఆదరణ దక్కించుకుంది. ఫస్ట్ పార్ట్ అడవుల్లో కథ నడవగా, సెకండ్ పార్ట్ నీళ్ళల్లో, మూడో పార్ట్ అగ్నితో అని చెప్పి ప్రమోట్ చేసిన కామెరూన్… పార్ట్ 3 కి టైటిల్ ఫైర్ & ఆష్ అనే పెట్టారు. తీరా చూస్తే సినిమా మొత్తం మళ్ళీ నీళ్ల చుట్టే తిరుగుతుంది. ఫైర్ జాతి మధ్యలో ఒకటి రెండు సార్లు వస్తారు. వాళ్ళ కథ ఏం చెప్పరు, వాళ్ళ విన్యాసాలు సింపుల్ గానే చూపించారు. ఇక కథ పరంగా మళ్ళీ పార్ట్ 2నే తీశారు అని అనుకున్నారు.