‘Avatar 3‘ | హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన లేటెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) భారీ అంచనాల మధ్య డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అవతార్ ఫ్రాంచైజ్‌లో మూడో భాగంగా వచ్చిన ఈ సినిమాపై అభిమానులు, ట్రేడ్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. అయితే, రిలీజ్ తర్వాత సినిమాకు వచ్చిన స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ విషయానికి వస్తే అవతార్ 3 తొలి మూడు రోజుల్లో కేవలం రూ.75 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇదే సమయంలో అవతార్ 2 (ది వే ఆఫ్ వాటర్) మొదటి మూడు రోజుల్లోనే రూ.175 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల ఓపెనింగ్ మధ్య ఉన్న భారీ తేడా అవతార్ 3పై ప్రేక్షకుల ఆసక్తి ఎంత మేర తగ్గిందో స్పష్టంగా చూపిస్తోంది.
కేవలం భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా అవతార్ 3 కలెక్షన్లు నిరాశపరిచాయి. అవతార్ ఫ్రాంచైజ్‌లో వచ్చిన తొలి రెండు భాగాలు ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించాయి. కానీ తాజా భాగం మాత్రం కనీసం 1.5 బిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా దాటడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డొమెస్టిక్ మార్కెట్ అయిన నార్త్ అమెరికాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ ఇప్పటివరకు అవతార్ 3 కేవలం 88 మిలియన్ డాలర్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. అవతార్ 2తో పోలిస్తే దాదాపు 34 శాతం వరకు కలెక్షన్లు తగ్గాయి అని హాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ స్థాయి ఓపెనింగ్‌ను పరిశీలిస్తే, సినిమాను ఇప్పటికే డిజాస్టర్ జోన్లోకి వెళ్లినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓవరాల్‌గా చూస్తే ఇప్పటివరకు అవతార్ 3 ప్రపంచవ్యాప్తంగా 345 మిలియన్ డాలర్ల గ్రాస్ మాత్రమే సాధించింది. గత రెండు భాగాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే ఈ సినిమా 2 బిలియన్ డాలర్ల కలెక్షన్లు కూడా సాధించడం కష్టమే అని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 2.5 బిలియన్ డాలర్ల వసూళ్లు అవసరం. ఆ స్థాయికి చేరుకోకపోతే, అవతార్ ఫ్రాంచైజ్లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.మరి రానున్న రోజుల్లో మౌత్ టాక్, హాలిడే సీజన్ బలంతో అవతార్ 3 ఏదైనా మ్యాజిక్ చేస్తుందా? లేక కలెక్షన్ల పరంగా మరింత కుంగిపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.