Trisha | అల్లు అర్జున్‌కి జోడీగా త్రిష.. నిజంగా ఇది ఆసక్తికరమైన కాంబినేషనే. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరూ చిన్న చిన్న పాత్రలు చేశారు. 2002 డిసెంబర్లో వచ్చిన ‘మౌనం పసియాదే’తో త్రిష హీరోయిన్ కాగా, 2003 మార్చిలో వచ్చిన ‘గంగోత్రి’తో బన్నీ హీరో అయ్యాడు. రెండు దశాబ్దాలపైన వీరి సినీప్రయాణంలో ఒక్కసారి కూడా జంటగా నటించకపోవడం గమనార్హం. అయితే.. ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్ సెట్ అయినట్టు కనిపిస్తున్నది.
అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా రానుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నదని సమాచారం. తాజాగా ఈ సినిమాకు చెందిన అప్డేట్ చెన్నయ్ సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతున్నది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో త్రిష కథానాయికగా నటించనుందనేది ఈ వార్త సారాంశం. సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. తన రానున్న సినిమాల గురించి అట్లీ చెబుతూ ‘ మళ్లీ భిన్నమైన కథతో రాబోతున్నాను. కచ్చితంగా సర్ప్రైజ్ చేస్తాను’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లీ స్టేట్మెంట్ ఈ సినిమా గురించే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.