Ashu Reddy | బిగ్‌బాస్ ఫేమ్ నటి అషు రెడ్డి భారీ మోసం చేసినట్టు అనేక ఆరోపణలకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువకుడిని పెళ్లి పేరుతో నమ్మించి కోట్ల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో కేసు నమోదైందని ప్రచారం జరుగుతోంది. వివరాల ప్రకారం… హైదరాబాద్ షేక్‌పేట్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర 2018లో ఇండియాకు వచ్చినప్పుడు Ashu Reddy తో పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. అమెరికాలో చదువులు పూర్తిచేసి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పి, అతనితో సన్నిహిత సంబంధం పెంచుకుందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆర్థిక సహాయం పేరుతో డబ్బులు తీసుకుందని, మొత్తం రూ.9.35 కోట్ల విలువైన నగదు, సుమారు 5 కిలోల బంగారం, అలాగే ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయించుకుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆస్తులన్నీ ఆమె పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించుకుందని కూడా ఆరోపిస్తున్నారు. పెళ్లి విషయంలో ముందుకు వచ్చి తరువాత వెనక్కి తగ్గిందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, తనపై వస్తున్న ఆరోపణలపై అషూ రెడ్డి పరోక్షంగా స్పందించింది. తన అనుమతి లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని సోషల్ మీడియా ద్వారా హెచ్చరించింది. డబ్స్మాష్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, ‘చల్ మోహన్ రంగ’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అషు రెడ్డి, ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత పలు షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా కొనసాగుతోంది. గతంలో కూడా కొన్ని వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆమెపై ఇప్పుడు వచ్చిన తాజా ఆరోపణలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.