Sonia Akula | ఆర్జీవీ హీరోయిన్ అంటే ఒక బ్యాడ్ ఇమేజ్ ఉంటుంది. వాళ్లు గ్లామర్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని.. పొట్టి దుస్తుల్లో కనిపిస్తారనే పేరు ఉంది. కానీ సోనియా ఆకుల మాత్రం డిఫరెంట్. తెలంగాణలోని పక్కా మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సోనియా ఆకుల.. ఆర్జీవీతో రెండు సినిమాలు చేసినప్పటికీ ఎప్పుడు హద్దులు దాటలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఏకంగా వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మతోనే ప్రశంసలు అందుకుంది. ఒకవైపు నటనలో రాణిస్తూనే మరోవైపు సమాజ సేవ కోసం స్వచ్ఛంద సంస్థను స్థాపించి శాయశక్తుల కృషిచేస్తుంది. సమాజ సేవ తన వృత్తి అయితే.. సినిమా తన ప్రవృత్తి అని చెబుతున్న సోనియా ఆకులతో నమస్తే తెలంగాణ స్పెషల్ ఇంటర్వ్యూ..
చిన్నతనం నుంచే మీకు సినిమాలు అంటే ఇష్టమా?
మా సొంత ఊరు మంథని. అమ్మ మల్లీశ్వరి, నాన్న చక్రపాణి. నాన్న వ్యవసాయం చేసేవారు. అమ్మ గృహిణి. ఇంటర్ నుంచి హైదరాబాద్‌లోనే చదువుకున్నా. నాకు ఇద్దరు అన్నయ్యలు. అమ్మను చూసి స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నా. ఇంట్లో చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.ఆడపిల్లలకు చదువుంటే ఏదైనా సాధించవచ్చు అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. మా ముగ్గురిని చదివించడం కోసమే అమ్మా, నాన్న చాలా కష్టపడేవారు. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం లేదు. ఇలా హీరోయిన్ అవుతానని అస్సలు అనుకోలేదు. కానీ, ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంది.
హీరోయిన్గా తొలి సినిమా అవకాశం ఎలా వచ్చింది?
బీటెక్ పూర్తయిన తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను. అప్పుడు అప్పుడు అక్కడ అంతర్జాతీయ కార్యక్రమాలు జరుగుతుండేవి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండటంతో కొన్ని కార్యక్రమాలకు నన్ను హోస్ట్‌గా పిలిచేవారు. అలా రవీంద్రభారతిలో సినీవారం ప్రోగ్రామ్‌కు మామిడి హరికృష్ణ హోస్ట్ చేయించారు. ఆ సమయంలో కొన్ని షార్ట్ ఫిలింస్ కూడా చేశాను. ఆ తర్వాత కొన్ని యాడ్స్ చేసే అవకాశం వచ్చింది. వాటిని చూసి నాకు జార్జి రెడ్డి సినిమాలో చెల్లెలి క్యారెక్టర్ ఇచ్చారు. చిన్నపాత్రే అయినా మంచి గుర్తింపు వచ్చింది. అందులో నటన చూసి రామ్‌గోపాల్ వర్మ వైరస్ మూవీలో తొలిసారిగా హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. నేను యాక్టింగ్ నేర్చుకోకపోయినా సమాజాన్ని, సినిమాలు చూసి నటనను అవగాహన చేసుకున్నా. కరోనా గురించి ప్రజలు విపరీతంగా భయపడుతున్న రోజులు.. అపోహలు నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని వైరస్ సినిమా ద్వారా ఇచ్చాం.
మీరు చేస్తున్న సామాజిక సేవ గురించి చెప్పండి..!
నాకు సమాజసేవ చేయడం చాలా ఇష్టం. అదొక వ్యసనంగా మారింది. కాలేజీ చదివే రోజుల్లోనే అనాథ పిల్లలకు నావంతుగా సాయం చేసేదాన్ని. ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లలో చాలా యాక్టివ్‌గా పాల్గొనేదాన్ని. అప్పుడే నాకు సేవపై ఆసక్తి కలిగింది. అలా ‘ఆసా’ అనే ఫౌండేషన్‌ను 2017లో ప్రారంభించాను. ఒకవైపు చదువుతూనే మరోవైపు సంతోష్‌నగర్‌లోని ఓ అనాథాశ్రమంలో పిల్లలకు ట్యూషన్ చెప్పేదాన్ని. వారితోనే ఎక్కువ సమయం గడపడంతో సేవ చేయాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. తరుణి, యువభారతి, ఆర్కే మఠం వాళ్లతో కలిసి వాలంటీర్‌గా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా. బీటెక్ పూర్తయ్యేంత వరకూ నాకు సివిల్స్‌పైనే గురి. రెండుసార్లు ప్రయత్నించాను.. ప్రిలిమ్స్ వరకు వెళ్లినా.. సాధ్యపడలేదు. మా అన్నయ్యల్లో ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్. నా సంపాదన, వారి సంపాదనతో పాటు అమ్మానాన్నల డబ్బులు కలిపి సేవా కార్యక్రమాలు చేపట్టాను. దానికి స్నేహితుల సాయం కూడా తోడైంది.
లాక్డౌన్ వేలాదిమంది ఆకలి తీర్చారని విన్నాం.. నిజమేనా?
అవును.. నిజమే. లాక్డౌన్ సమయంలో తినేందుకు తిండి లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్లకు మా వంతుగా ఏదైనా చేయాలని అనుకున్నాం. వేలాదిమంది ఆకలి తీర్చాం. ఆసా ఫౌండేషన్ ద్వారా గ్రామాల్లో కమిటీలు వేయించాం. నిరుపేదలను ఎంపిక చేసి నిత్యావసరాలు పంపిణీ చేశాం. కూకట్పల్లి దగ్గరలోని మురికివాడలో నిత్యావసరాలు పంచాం. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు లేని కొందరికి అధికారులతో మాట్లాడి ప్రభుత్వసాయం రూ. పదిహేను వందలు వచ్చేలా చేశాం. అనాథాశ్రమాల పిల్లలకు అధికారుల ద్వారా సాయం అందేలా విశేష కృషి చేయగలిగాం.
మళ్లీ సివిల్స్ వైపు వెళ్లే ఆలోచన ఉందా? సినిమాలకే పరిమితమా?
ప్రజలకు నేరుగా సేవ చేయాలనే భావన నా ఆసా ఫౌండేషన్‌తో తీరింది. ఇప్పుడు బాధితులు ఎక్కడున్నారో తెలుసుకొని మరీ సాయం చేస్తున్నాం. ప్రస్తుతానికి సివిల్స్‌పై ఆశ లేదు. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. మంచి సబ్జెక్ట్ ఉన్న కథలనే వినాలన్నది నా పాయింట్. కొంచెం ఆలస్యమైనా సమాజానికి ఉపయోగపడే సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి సినిమాల ద్వారా ఒక్కరిలో మార్పు వచ్చినా నా కల నెరవేరినట్లే.
సినిమాలే చేస్తారా? సమాజసేవ చేస్తారా?
ప్రస్తుతం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. సమాజ సేవ నా వృత్తి అయితే.. సినిమాలు నా ప్రవృత్తి. ఒక పల్లెటూరిలో పుట్టి, పెరిగిన పిల్లగా.. నాకు ప్రజల సమస్యలపై అవగాహన ఉంది. పీడితుల సమస్యలు తెలుసు. అందుకే సేవా రంగాన్నే ముందుగా ఎంచుకున్నా. అనాథలు, అన్నార్థులకు సాయం చేయడమే నా లక్ష్యం. సినిమాలు చేయనని కాదు కానీ, సేవకే నా మొదటి ప్రాధాన్యం. సినిమా ద్వారా వచ్చే డబ్బుతో ఇంకా విస్తృతంగా సేవ చేసే అవకాశం ఉంది. ఈ రెండూ నాకు అవసరమే.
సమాజహితమైన సినిమాలే చేస్తారా?
మంచి కథతో సంప్రదిస్తే చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నేను చేసే పాత్ర ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుందంటే సినిమా వెంటనే ఒప్పేసుకుంటా. ఇలా పట్టుబట్టి ఉండటం వల్లనే ఏడాదిన్నరలో నన్ను కొందరు రిజెక్ట్ చేశారు.. నేను కొన్ని కథలను రిజెక్ట్ చేశాను. ఈ కాలంలో సమాజానికి ఉపయోగపడే కథలు రావాలి కూడా.
ఆశా ఎన్కౌంటర్ సినిమా నుంచి ఏం తెలుసుకున్నారు..?
ఇది రెండు వైపుల పదునున్న కత్తిలాంటి సినిమా. దీని ద్వారా సమస్యను రెండువైపులా చూడటం అలవాటైంది. ఇలాంటి ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధితురాలినే నిందితురాలిగా చూసే విధానం మారాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి, చెడుల గురించి, ముఖ్యంగా ఆడపిల్లల భద్రత గురించి వివరంగా చెప్పాలి. యువతరం కూడా ఏదైనా తప్పు చేస్తే ఎలా తప్పించుకోవాలో అనే ఆలోచన చేస్తున్నారే కానీ, అసలు ఆ తప్పు ఎందుకు చేయాలి? అని ప్రశ్నించుకోవడం లేదు. ఆ ప్రగతిశీలమైన అలాంటి ఆలోచన చేయకపోవడంతో ఎన్ని అనర్థాలు వస్తాయో ఈ సినిమా ద్వారా చూశాం. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికీ.. ఒక్కొక్క రక్షకుడిని ఏర్పాటు చేయలేదు కాబట్టి.. తమ బిడ్డలను మార్చుకునే ఆలోచన ప్రతి గడపనుంచీ రావాలి. ఇటువంటి ఆలోచనలపై చర్చ జరగాలి. అప్పుడే ప్రతి ఆడబిడ్డకూ రక్షణ దొరుకుతుంది.
మీ చేతిలో ఏమైనా కొత్త ప్రాజెక్టులు ఉన్నాయా?
ఒక పెద్ద సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రెండు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నా. నేను నటిగా రాణించగలుగుతానని నమ్మకం ఆర్జీవీ మాటల్లోనే తేలింది. ‘సోనియా నీ నటన చాలా న్యాచురల్‌గా ఉంటుంది. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తావు. టాలీవుడ్లో నీకు మంచి భవిష్యత్ ఉంది’ అని ఆర్జీవీ అభినందించారు. కారణం.. నా డైలాగ్స్‌ను చాలాసార్లు సింగిల్ టేక్‌లోనే చేయడం. తెలుగులోనూ అందులోనూ తెలంగాణలో హీరోయిన్లు చాలా తక్కువగా ఉన్నారు. ఔత్సాహికులను ప్రోత్సహిస్తేనే మనవారికి భవిష్యత్ ఉంటుంది.
మీ ‘ప్రాజెక్ట్ శక్తి’ గురించి చెప్పండి ?
ప్రాజెక్ట్ శక్తి అనేది కేవలం అనాథలైన ఆడబిడ్డల చదువు కోసం ప్రారంభించాం. ఇందులో భాగంగా వందమంది అనాథ ఆడపిల్లలను దత్తత తీసుకొని, వారికి పూర్తి ఉచితంగా చదువు చెప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం పదిమందిని ఎంపిక చేశాం. వారికి ఈ ప్రాజెక్ట్ నుంచి ఉచితంగా చదువుతోపాటు సర్వం చూసుకుంటున్నాం. లక్ష్యాన్ని చేరుకునేందుకు మా బృందాలు నిజమైన బాధితుల కోసం తిరుగుతున్నాయి. నేను లాస్య అనే పాపను దత్తత తీసుకొని చదివిస్తున్నాను.
భవిష్యత్‌లో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాని అనుకుంటున్నారు?
మా లక్ష్యం అంతా బాలికా విద్యను ప్రోత్సహించడంపైనే కేంద్రీకరించాం. గ్రామాల్లో పిల్లల కోసం వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాం. మా స్పాన్సర్స్‌తో పాటు, కొన్ని గేటెడ్ కమ్యూనిటీలతో మాట్లాడి అందుకు చేతనైన సాయం చేస్తున్నాం. మంథని, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో ఐదు లైబ్రరీలను కూడా ఏర్పాటు చేశాం. మారుమూల గ్రామాల్లో చదువుకు ఆటంకం కలగకుండా లైబ్రరీలు ఏర్పాటు చెయ్యాలనే ఆలోచన ఉంది. ఒంటరి మహిళల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. వారికి కూడా చేతనైన సాయం చేస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. దీంతో రైతుల సమస్యలు చాలా వరకు తగ్గాయి. మా దృష్టికి వచ్చిన వాటికి మావంతుగా పరిష్కారం చూపుతున్నాం. భవిష్యత్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో మా స్పాన్సర్స్, వలంటీర్లు, ముఖ్య సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకొని, దానిని పక్కాగా అమలు చేస్తాం.
– డప్పు రవి
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Sonia Akula | కాలేజీ రోజుల్లోనే సేవ.. ఇప్పుడు అనాథ ఆడబిడ్డల కోసం కృషి
Lata Mangeshkar | తెలుగులో మూడే పాటలు పాడిన లతా మంగేష్కర్.. కారణం ఏంటో తెలుసా?
1950ల్లో ఒక్కో పాటకు లతాజీ ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు..?
Meera Jasmine | మళ్లీ రెచ్చిపోయిన మీరా జాస్మిన్..