Anushka Ghaati Movie |టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఘాటీ’ విడుదల మరోసారి వాయిదా పడే సూచనలు మళ్లీ కనిపిస్తున్నాయి. గతంలో ‘వేదం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత, మేకర్స్ అధికారికంగా జులై 11న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా పూర్తి చేశారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం, సినిమాకు సంబంధించిన సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, విడుదల తేదీ లోపు అవి పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో, ‘ఘాటీ’ విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త విడుదల తేదీగా ఆగస్టు 27ను నిర్మాతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అనుష్క అభిమానులు ‘ఘాటీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, సినిమా విడుదల ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి.