చాలెంజింగ్ రోల్స్ చేయడం అందాల తార అనుష్కకు అలవాటే. బలమైన కథలో శక్తిమంతమైన క్యారెక్టర్ సవాలు విసిరితే స్వీకరించేందుకు ఆమె ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ‘అరుంధతి’, ‘వేదం’, ’సైజ్ జీరో’ వంటి ఎన్నో చిత్రాల్లో ఆమె సాహసోపేతమైన క్యారెక్టర్స్ ఎంచుకుంది. ప్రస్తుతం అనుష్క తన 48వ చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమాలోనూ ఈ తార ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ను డిస్కస్ చేస్తున్నదట. సరోగసీ అంశం చుట్టూ ఈ చిత్ర కథ ప్రధానంగా ఉంటుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అనుష్క అన్విత రవళి శెట్టి అనే మధ్య వయస్కురాలైన చెఫ్ పాత్రను పోషిస్తున్నది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా తర్వాత అనుష్క మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నట్లు సమాచారం.