‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత అనుష్క నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించడమే ఈ జాప్యానికి కారణం అని తెలుస్తున్నది. ఎట్టకేలకు స్వీటీ ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. కథను ఓకే చేయడమేకాక, గప్‌చిప్‌గా షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నది. ఇంతకీ ఆ సినిమా ఏంటా! అనుకుంటున్నారా? అనుష్కతో ‘వేదం’ లాంటి గొప్ప సినిమాను తెరకెక్కించిన క్రిష్ దర్శకత్వంలో మళ్లీ ఓ సినిమా చేస్తున్నది అనుష్క.
ఈ సినిమాకు ‘శీలావతి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ‘శీలావతి’ అంటే ఓ రకం చేప పేరు. మరి ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘వేదం’లో అనుష్క పోషించిన సరోజ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది, రానున్న ఈ ‘శీలావతి’ కూడా ఆమె కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది అని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టు టాక్. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. క్రిష్, సాయిమాధవ్ కలయికలో వచ్చిన కృష్ణంవందేజగద్గురుమ్, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు ఎంతటి విజయాలను అందుకున్నాయో తెలిసిందే. వాటికి ఏ మాత్రం తగ్గని సామాజికస్పృహతో కూడిన ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నది.