Sajda Pathan | ఆస్కార్ సందడి మొదలైంది. ఈ ఏడాది భారత్ నుంచి ‘అనూజ’ లఘుచిత్రం.. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల రేసులో నిలిచింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ చిత్రం నామినేట్ అయ్యింది. అయితే, సినిమా కన్నా ఎక్కువగా.. అందులో టైటిల్ రోల్ (అనూజ పాత్ర) పోషించిన తొమ్మిదేళ్ల ‘సజ్దా పఠాన్’ గురించే ఎక్కువ చర్చ నడుస్తున్నది. ‘అసలు ఎవరీ అమ్మాయి?’ అంటూ నెట్టింట వెతుకులాట మొదలైంది. ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలంటే.. ఢిల్లీ గల్లీల్లోకి వెళ్లాల్సిందే! నిరుపేద కుటుంబానికి చెందిన సజ్దా పఠాన్.. ఓ బాలకార్మికురాలు. బాగా చదువుకోవాలన్న ఆశ ఉన్నా.. పేదరికం వల్ల పనికి వెళ్లేది.
ఈ క్రమంలో నటి మీరా నాయర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సలామ్ బాలక్ ట్రస్ట్’ స్వచ్ఛంద సంస్థ.. సజ్దాకు అండగా నిలిచింది. ఆమెకు ఆశ్రయం కల్పించి, చదువు చెప్పిస్తున్నది. నటనపై ఆసక్తి ఉన్న సజ్దా.. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు నటనా రంగంలోనూ రాణిస్తున్నది. ‘ద బ్రెయిడ్’ అనే ఫ్రెంచ్ సినిమా ద్వారా సినీరంగానికి పరిచయమైంది. ‘అనూజ’ ఆమె నటించిన రెండో సినిమా. ఇలా.. రెండో చిత్రంతోనే ఆస్కార్ బరిలో నిలవడంతో అందరూ సజ్దాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘అనూజ’ చిత్రానికి ఆడమ్ జె గ్రేవ్స్, సుచిత్రా మట్టయి దర్శకత్వం వహించగా.. గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు.