Jayam Ravi House | తమిళ నటుడు జయం రవి(రవి మోహన్) మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇప్పటికే తన భర్య ఆర్తితో విడాకుల వివాదం కోర్టులో నడుస్తుండగా.. తాజాగా అతడి ఇల్లు వివాదంలో చిక్కుకుంది. చెన్నైలోని ఇంజంబక్కంలో ఉన్న ఆయన ఇంటిని వేలం వేయడానికి బ్యాంకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఇంటికి సంబంధించి జయం రవి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ప్రైవేటు బ్యాంక్ అధికారులు ఆయన ఇంటికి వేలం నోటీసులను అంటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళితే.. జయం రవి తన ఇంటి కోసం ఒక ప్రైవేటు బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకున్నట్లు సమాచారం. ఈ రుణానికి సంబంధించిన నెలవారీ ఈఎంఐలను ఆయన చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి సుమారు రూ.7.60 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినట్లు బ్యాంకు జారీ చేసిన నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ రుణం చెల్లించమని బ్యాంక్ యాజమాన్యం గతంలో పలుమార్లు జయం రవికి నోటీసులు పంపించింది. కానీ వాటికి జయం రవి స్పందించకపోవడంతో సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆస్తులు అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ (SARFAESI Act) కింద ఈ ఇంటిని వేలం వేసి తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.