Anna Konidela | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు, త్యాగాలు ఉన్నాయని ఆయన సతీమణి అన్నా కొణిదెల్ తాజాగా చేసిన పోస్ట్‌లో వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న ఈ సందేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ అన్నా తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ఒక వ్యక్తి తన నమ్మకాలు, ఆత్మగౌరవం కోసం చేసిన సుదీర్ఘ పోరాటానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు.
2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి 2024 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించే వరకు పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని అన్నా వెల్లడించారు. ప్రజలు విజయాన్ని మాత్రమే చూస్తారని, కానీ ఆ విజయానికి ముందు ఉన్న బాధలు, అవమానాలు, మానసిక ఒత్తిడిని చాలా మంది గుర్తించరని ఆమె పేర్కొన్నారు. తన భర్తను రాజకీయంగా విమర్శించడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎగతాళి చేశారని, ఎన్నో అవమానకర వ్యాఖ్యలు ఎదుర్కొన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన తన లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాజకీయ పోరాటం చేస్తుండగా, తాను ఇంట్లో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయం, ఆందోళన, ఒంటరితనంతో యుద్ధం చేశానని అన్నా వెల్లడించారు. ప్రతి రోజు కూడా “ఒక వ్యక్తి తన నమ్మకం కోసం ఇంకా ఎంతకాలం ఇన్ని కష్టాలు భరించగలడు?” అనే ప్రశ్న తనను వెంటాడేదని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తాము మానసికంగా పూర్తిగా కుంగిపోయామని, కానీ తమ మనస్సాక్షిని చంపుకోకుండా ధైర్యంగా నిలబడాలని నిర్ణయించుకున్నామని ఆమె వివరించారు. అదే తమకు చివరికి విజయాన్ని అందించిందని చెప్పారు. కూటమి విజయం అనంతరం జరిగిన కార్యక్రమాల్లో తన కళ్లలో కనిపించిన ఆనంద బాష్పాలను కూడా అన్నా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో మోదీ కూడా తన భావోద్వేగాలను గమనించారని ఆమె తెలిపారు.
అవి రాజకీయ విజయానికి సంబంధించిన కన్నీళ్లు కాదని, ఎన్నో సంవత్సరాల బాధ, అవమానాలు, కష్టాల తర్వాత వచ్చిన ఉపశమనం వల్ల కలిగిన ఆనంద బాష్పాలని ఆమె పేర్కొన్నారు. ఆ క్షణం తన జీవితంలో మరచిపోలేని అనుభూతిగా నిలిచిపోయిందన్నారు. దేవుడు కొన్నిసార్లు మనుషులను తీవ్రంగా పరీక్షిస్తాడని, అవమానాలకు గురిచేస్తాడని, కానీ సరైన సమయంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి ఇస్తాడనే నమ్మకం తనకు ఉందని అన్నా చెప్పారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదని ఆమె పేర్కొన్నారు.ఆ క్షణంలో నాకు కలిగిన ఏకైక భావన గర్వం మాత్రమే. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా తన లక్ష్యం కోసం పోరాడిన నా భర్తను చూసి ఎంతో గర్వపడుతున్నాను అంటూ అన్నా కొణిదెల తన భావోద్వేగ సందేశాన్ని ముగించారు.