Anil Ravipudi | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సుమారు రూ.400 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించి టాలీవుడ్లో నయా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ మాత్రమే కాదు, ఆయన టైమింగ్‌కు తగ్గ కామెడీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మరోసారి ఆయన పాత రోజులను గుర్తు చేసేలా చేశాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాస్ ఆడియన్స్ వరకూ అన్ని వర్గాల వారిని సినిమా అలరించడంతో చిత్రయూనిట్‌తో పాటు మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
ఈ భారీ విజయం దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ, ఓ హీరో కోసం కథ రాసేటప్పుడు ఆయనపై పూర్తి ప్రేమ, అభిమానం ఉండాలని, అప్పుడే కథ సహజంగా, బలంగా వస్తుందని తెలిపారు. చిరంజీవిలాంటి లెజెండరీ స్టార్ కోసం కథ రాసేటప్పుడు ఇదే సూత్రాన్ని పాటించానని చెప్పారు. అలాగే సినిమా ప్రారంభంలోనే యాక్షన్ సీన్‌తో ఎంట్రీ ఇవ్వకుండా, బట్టలు ఆరేసుకునే వరప్రసాద్ ఒక ఆంటీతో గొడవపడే సాధారణ సీన్ ద్వారా పాత్రను పరిచయం చేయాలని ముందే నిర్ణయించుకున్నానని వెల్లడించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాత్రలకు సాధారణంగా యాక్షన్ ఓపెనింగ్ ఉంటుందని, దాన్ని బ్రేక్ చేసి విడాకులు తీసుకున్న ఓ సాధారణ వ్యక్తి రోజువారీ జీవితాన్ని చూపించడం ద్వారా ప్రేక్షకులను పాత్రకు దగ్గర చేయాలనుకున్నానని చెప్పారు.
ఆ తర్వాత నుంచే చిరంజీవి మాస్ యాంగిల్, హీరోయిజాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలివేట్ చేశామని తెలిపారు. అంతేకాదు, సినిమాలో VTV గణేష్‌తో తెరకెక్కించిన ఓ 6–7 నిమిషాల ఎపిసోడ్‌ను ఎడిటింగ్ దశలో తొలగించినట్లు అనిల్ రావిపూడి వెల్లడించారు. షూటింగ్ సమయంలో బాగానే అనిపించిన ఆ సన్నివేశం ఎడిట్‌లో కథ ఫ్లోను డిస్టర్బ్ చేస్తున్నట్లు అనిపించడంతో తొలగించామని, చిరంజీవి కూడా వెంటనే అంగీకరించారని చెప్పారు. ఆ సీన్ తీసేయడంతో సినిమాకు మరింత వేగం వచ్చిందని తెలిపారు. మొత్తం షూటింగ్ అనుభవం ఒక పండగలా జరిగిందని, చిరంజీవితో పని చేయడం తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి అని అనిల్ రావిపూడి భావోద్వేగంగా చెప్పారు.