Anil Ravipudi | టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది దర్శకుడు అనిల్ రావిపూడి పేరు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై, కేవలం పది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయం అనిల్ రావిపూడి మార్కెట్‌ను మరింత పెంచింది. ఈ విజయం తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయాలనే ఆసక్తితో పలువురు అగ్ర హీరోల నిర్మాతలు క్యూ కడుతున్నారు. పవన్ కళ్యాణ్, రానా వంటి స్టార్లతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందంటూ సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ వార్తలపై దర్శకుడు గానీ, మేకర్స్ గానీ అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉండగా, తాజాగా అనిల్ రావిపూడి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటివరకు తనకు బ్రాండ్‌గా మారిన ఫుల్ కామెడీ జానర్‌కు కొంత బ్రేక్ ఇచ్చి, పూర్తిగా భిన్నమైన జానర్లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌పై తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని కూడా చెప్పారు. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరు అన్నది మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాలో విలన్ పాత్రకు మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే కథపై చర్చలు జరిగాయని, కథ విన్న వెంటనే ఫహద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న సమాచారం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరుగుతున్నట్టు టాక్.
సాధారణంగా ముందుగా హీరో ఫిక్స్ చేసి తర్వాత విలన్ ఎంపిక చేస్తారు. కానీ ఇక్కడ హీరో ఇంకా ఫైనల్ కాకుండానే విలన్ సెట్ కావడం ఇండస్ట్రీలో అరుదైన విషయమే. ఈ వార్తలు నిజమైతే, అనిల్ రావిపూడి ఈసారి పూర్తిగా కొత్త స్టైల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని చెప్పొచ్చు. కొత్త జానర్, పవర్ఫుల్ విలన్ కాంబినేషన్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అంచనాలు అప్పుడే మొదలయ్యాయి.