Ananya Nagalla | టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో తెలుగు నటీమణులే హీరోయిన్లుగా నటించేవారు. కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళు కేవలం సైడ్ క్యారెక్టర్లకే పరిమిత మవుతున్నారు. ఈ క్రమంలో అనన్యనాగళ్ళ మాత్రం నటన ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంటుంది. ‘మల్లేశం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్గా అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ‘వకీల్‌సాబ్’ సినిమాలో కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది.
‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్యకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈమె సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది. ఏడాదికి ఒకటీ రెండు సినిమాలతో బిజీగా గడుపుతున్న అనన్య తాజాగా తమిళ ఎంట్రీకి ముస్తాబవుతుంది. తమిళ హీరో శశికుమార్ ప్రధాన పాత్రలో ‘అంజల్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా అనన్య నటించనుంది. సౌత్ ఇండియా అంతా ప్రయాణించే ఓ ట్రావెలర్ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనుంది.