‘బేబీ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’. ‘90s వెబ్ సిరీస్’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా నుంచి ‘మనసా వాచా’ అనే మూడో గీతాన్ని విడుదల చేశారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన ఈ గీతాన్ని ప్రముఖ గాయకులు చిత్ర, ఎస్పీ చరణ్ ఆలపించారు. శ్రీహర్ష ఈమని రచన చేశారు. ప్రేమ, విరహం, ఎడబాటు వంటి భావోద్వేగాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. ప్రేమికుల మానసిక సంఘర్షణను ఈ పాటలో ఆవిష్కరించారు. లండన్ నేపథ్యంలో సాగే న్యూఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, వినోదానికి పెద్దపీట వేశామని మేకర్స్ తెలిపారు.