ఇటీవల ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్లో గాయపడిన అమితాబ్ బచ్చన్ కోలుకుంటున్నారు. త్వరలోనే షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కె’లో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్న అమితాబ్ గాయపడ్డారు. పక్కటెముక కండరాల్లో చీలిక ఏర్పడింది. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ముంబై వెళ్లి చికిత్స తీసుకున్నారు.
‘మీ ప్రార్థనలతో ప్రస్తుతం నేను కోలుకుంటున్నా. ఆరోగ్యం బాగవుతున్నది. త్వరలోనే షూటింగ్‌లకు సిద్ధమవుతా. నా ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న ప్రతి అభిమానికి కృతజ్ఞతలు.’ అని అమితాబ్ తెలిపారు. అభిమానులు, సినీ తారలు ఈ పోస్ట్‌కు స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బీ ప్రస్తుతం ‘ఘణపత్’, ‘గూమర్’, ‘ది ఉమేష్ క్రానికల్స్’, ‘బటర్ ఫ్లై’, ‘ఖాకీ 2’ వంటి దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తున్నారు.