దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898ఏడీ’. మోస్ట్ ఎవైటెడ్ అప్‌కమింగ్ ఫిక్షన్ ఎపిక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ప్రభాస్ హీరోగా, అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొనే, దిషా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అందుకే కొన్ని నెలల క్రితమే ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ షురూ చేశారు. అందులో భాగంగా ఈ శుక్రవారం.. యుద్ధభూమి మధ్య నిలబడి, అస్ర్తాన్ని చేబూని, నుదిటిపై దివ్య రత్నంతో, యుద్ధానికి సిద్ధంగా ఉన్న ద్రోణసుతుడైన అశ్వత్థామగా అమితాబ్ న్యూలుక్‌ని రివీల్ చేశారు. ఆయన వెనుక ఓ పెద్ద వెహికల్తోపాటు కొంతమంది వ్యక్తులు అచేతనులై పడివుండటం గమనించవచ్చు. ఇందులోని అమితాబ్ నటించిన అశ్వత్థామ పాత్రను మధ్యప్రదేశ్‌లోని నెమావార్, నర్మదా ఘాట్ వద్ద భారీ ప్రొజక్షన్ ద్వారా మేకర్స్ లాంచ్ చేయడం విశేషం. ఇక్కడే ఆయన గెటప్‌ను లాంచ్ చేయడానికి ఓ కారణం ఉందని, నర్మదా మైదానంలో ఇప్పటికీ అశ్వత్థామ నడుస్తాడని చాలామంది నమ్మకమని, అందుకే ఇక్కడ లాంచ్ చేయడం జరిగిందని మేకర్స్ తెలిపారు.