Amaran | శివకార్తీకేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకుడు. కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మాతలు. ఈ సినిమాలోని ‘హే రంగులే..’ అనే గీతాన్ని సోమవారం హీరో నితిన్ విడుదల చేశారు. జీవీ ప్రకాష్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు. ఈ పాటలో నాయకనాయికల మధ్య ఉన్న ప్రణయబంధాన్ని, వారి జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించారు.
విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ అధ్యాయం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, త్యాగం అంశాల నేపథ్యంలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే చిత్రమిదని, దీపావళి సందర్భంగా ఈ నెల 31న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి విడుదల చేస్తున్నారు.