దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు సాధించింది అందాలభామ ప్రియమణి. ప్రస్తుతం ఆమె సినిమాలు, సిరీస్, టీవీ ప్రోగ్రామ్స్‌తో బిజీ బిజీగా ఉన్నది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. ‘నేను మతాంతర వివాహం చేసుకున్నాను. దాంతో నాపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీదా రాలేదు. నేనేదో దేశద్రోహం చేసినట్టు రెచ్చిపోయి మరీ కామెంట్లు పెట్టేవారు. మనసులు కలవడానికి కులమతాలు అడ్డుకావు. ముస్తాఫా రాజ్ నాకెంతోకాలంగా తెలుసు.
మా అభిప్రాయాలు, అభిమతాలు కలిశాయి. పెద్దల అంగీకారం లభించింది. ఎనిమిదేండ్ల క్రితం ఇద్దరం పెళ్లితో ఒకటయ్యాం. ఈ రోజుకు కూడా మా పెళ్లి విషయంలో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయంటే నమ్ముతారా!? మొదట్లో ఈ ట్రోల్స్ వల్ల బాధపడేదాన్ని. ఇప్పుడు అలవాటు పడిపోయా.’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. ‘జవాన్’తో గత ఏడాది ప్రేక్షకుల్ని పలకరించింది ప్రియమణి. ఈ ఏడాది ఆమె నటించిన మైదాన్, ఆర్టికల్ 370 చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఓటీటీలో విడుదలైన ‘భామాకలాపం 2’కు మాత్రం మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు.