Allu Sirish -Nayanika | టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడిగా మారేందుకు తొలి అడుగు వేశారు. ఆయన నిశ్చితార్థం శుక్రవారం, అక్టోబర్ 31న హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తుపాను మొంథా కారణంగా ఏర్పాట్లలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, చివరికి అన్ని ఏర్పాట్లు విజయవంతంగా పూర్తయ్యాయి. శిరీష్ తన నిశ్చితార్థ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “నా జీవితానికి ప్రేమ అయిన నయనికతో నా నిశ్చితార్థం జరిగింది” అని కామెంట్ పెట్టారు.
ఫొటోలలో వధూవరులు ఇద్దరూ అద్భుతంగా కనిపించారు. అల్లు శిరీష్ వైట్ ట్రెడిషనల్ దుస్తుల్లో, నయనిక రెడ్డి రెడ్ కలర్ శారీలో మెరిసిపోయారు. ఇద్దరూ రింగులు మార్చుకుంటున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌కి చెందిన నయనిక రెడ్డి బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. చాలా కాలంగా శిరీష్‌తో పరిచయం ఉండి, ఆ స్నేహం ప్రేమగా మారిందని సమాచారం. త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. అల్లు కుటుంబంతో పాటు, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రాంచరణ్ – ఉపాసన, నాగబాబు – పద్మజ, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు హాజరై శిరీష్ దంపతులకు ఆశీస్సులు అందించారు.
ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మరియు సినీ ప్రముఖులు శిరీష్, నయనిక జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉంగరాల మార్పిడి సమయంలో శిరీష్ తల్లి, సోదరులు అల్లు అర్జున్, మేనల్లుడు అర్హా అందరు అక్కడే ఉండడం కుటుంబ బంధాన్ని ఆవిష్కరించింది. కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదాల మధ్య ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. ఈ మెగా ఈవెంట్, మెగా కుటుంబంలో ఉన్న ప్రేమ, అనుబంధాలను మరోసారి చాటి చెప్పినట్టు అయింది. గత కొంత కాలంగా అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య విబేధాలు ఉన్నాయన్న వార్తలకు ఈ వేడుక చెక్ పెట్టినట్టు అయింది.