Allu Arjun | వగత కొన్నాళ్లుగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు పీక్స్‌లో ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఆయన తరపున ప్రచారం చేయకుండా, వైసీపీ తరపు వ్యక్తికి బన్నీ ప్రచారం చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఇక అప్పటి నుండి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య రిలేషన్ దెబ్బతిందని కొంత ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు చిరంజీవి బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ వీటన్నింటికి చెక్ పడేలా చేసింది అనే చెప్పాలి. ఈ రోజు చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ ఓ ఫంక్షన్లో చిరుతో కలిసి స్టెప్పులు వేసిన ఫొటోని షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే టూ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్ట్‌తో అటు అల్లు ఫ్యాన్స్‌తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక విక్టరీ వెంకటేష్.. డియర్ చిరంజీవి.. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి. ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఇక హరీష్ శంకర్, సాయి తేజ్, నారా రోహిత్, తేజ సజ్జాతో పాటు పలువురు ప్రముఖులు చిరుకి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం ముంబైలో ‘వేవ్స్’ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) లో చిరంజీవి తనను ఎంతగానో ప్రభావితం చేశారని వెల్లడించారు. “సినిమానే నా ప్రపంచం. నాకు మరో ఆలోచన లేదు. ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. తనకు తన కుటుంబం నుంచి అన్ని విధాలుగా మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. తన తాత అల్లు రామలింగయ్య సుమారు వెయ్యి చిత్రాల్లో నటించారని, తన తండ్రి అరవింద్ 70 సినిమాల వరకు నిర్మించారని, తన మామయ్య చిరంజీవి తనకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని, ఆయన తనను ఎంతగానో ప్రభావితం చేశారని చెప్పుకొచ్చారు.