అగ్ర హీరో అల్లు అర్జున్‌కు కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అల్లు అర్జున్ కేరళ అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. అయితే ఈ వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ పోస్ట్ ద్వారా అల్లు అర్జున్ సేవాగుణం గురించి తెలిసింది. వివరాల్లోకి వెళితే..అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి నర్సింగ్ చేయాలన్నది కల. ఆమెకు కట్టనమ్లోని సెయింట్ థామస్ నర్సింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో సీటు లభించింది. దానికి ఓ స్పాన్సర్ అవసరం కావడంతో కలెక్టర్ కృష్ణతేజ..అల్లు అర్జున్ను సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి విద్యార్థిని హాస్టల్ ఫీజులతో సహా అన్ని ఖర్చులు భరిస్తానని మాటిచ్చారు. ఆ విద్యార్థిని కాలేజీలో జాయిన్ అయిన రోజు నుంచే ఎంతో ఉత్సాహంగా కనిపించిందని, ఆమె సమాజానికి సేవ చేస్తుందనే నమ్మకం ఉందని కలెక్టర్ కృష్ణతేజ ఆనందం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ సహృదయతకు యాజమాన్యం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.