‘పుష్ప’ ఫ్రాంచైజీతో పానిండియా స్టార్‌గా అవతరించారు అగ్ర హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో భారీ పానిండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తారు బన్నీ. మరి ‘పుష్ప 3’ ఎప్పుడు?.. ఇప్పుడు అటు అభిమానుల్లోనూ, ఇటు ఆడియన్స్‌లోనూ ఇదే ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. బన్నీ తన ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అలాగే దర్శకుడు సుకుమార్ కూడా త్వరలో రామ్‌చరణ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే గానీ ‘పుష్పరాజ్’ లైన్లోకి రాడు. అయితే.. ఇన్సైడ్ టాక్ ప్రకారం ‘పుష్ప: ది ర్యాంపేజ్’ పనులు నిదానంగా మొదలైనట్టు తెలిసింది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ ఆఫీసును కూడా లీజుకు తీసుకున్నదట సుకుమార్ అండ్ టీమ్.
ప్రస్తుతం ఆ ఆఫీసులో స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతున్నదని టాక్ నడుస్తున్నది. ఈ మూడో భాగంలో ఎర్రచందనం సామ్రాజ్యాన్ని పుష్పరాజ్ తిరిగి ఎలా కైవసం చేసుకున్నాడు? శత్రువులను ఎలా అంతం చేశాడు? అనేదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందని వినికిడి. ఏదేమైనా ఈ సినిమా సెట్స్‌కి వెళ్లాలంటే.. అది రెండేళ్ల పైమాటే.