Alia Bhatt | సహజంగానే పెళ్లైన నాయికల కెరీర్ నెమ్మదిస్తుంది. నవ వధువు ఆలియా భట్ కెరీర్ కూడా అలాగే మారనుందా అనిపిస్తున్నది. గురువారం తన ప్రియుడు రణబీర్ కపూర్ తో ఏడడుగులు వేసింది ఆలియా. మరో వారం దాకా ఆమె ఈ వేడుకల్లోనే మునిగితేలనుంది. ఈ సంతోషాలకు మరే అడ్డు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఆ క్రమంలోనే ఎన్టీఆర్‌తో నటిస్తున్న సినిమానూ ఆలియా వదిలేసుకుందని తాజా సమాచారం.
ఎన్టీఆర్‌తో దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న సినిమాలో నాయికగా ఆలియా భట్‌ను ఎంచుకున్నారు. ఆమె కూడా ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా కన్ఫర్మ్ చేసింది. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రమిది. ఇది టాలీవుడ్లో తెరకెక్కనున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. మరో నాయిక ఎవరైనా ఈ సినిమాను వద్దనుకునేది కాదు. అయితే ఆలియా ఇప్పుడున్న వ్యక్తిగత జీవితపు దశలో ఓ కమర్షియల్ సినిమాకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నది. మరోవైపు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఏదైనా ముందే చెప్పేస్తే బెటరని ఆలియా ఎన్టీఆర్ 30 టీమ్‌కి విషయం చెప్పేసిందని తెలుస్తున్నది.
ఎన్టీఆర్ ఆలియా కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాకు పనిచేశారు. ఆ పరిచయంతోనే ఆలియా పర్మార్మెన్స్, సినిమా పట్ల ప్యాషన్ చూసి ఎన్టీఆర్ ఈ చిత్రానికి రిఫర్ చేశారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆలియా ఉంటే కలిసొస్తుందనేది మరో ఆలోచన. ఇప్పుడు ఆమె తప్పుకోవడంతో మరో నాయికను వెతికే పనిలో చిత్రబృందం పడ్డారట. ఏదైనా అఫీషియల్ గా ఇది కన్ఫర్మ్ కావాల్సి ఉంది.