Akshay Kumar | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇటీవల ఒక షూటింగ్లో భాగంగా స్టంట్ మాస్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతడు చనిపోయిన తర్వాత చలించిపోయిన నటుడు అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు 650 మంది స్టంట్‌మెన్‌లకు ఆరోగ్య, మరియు ప్రమాద బీమా కవరేజీని అందించారు. దీంతో ఈ విషయం తెలిసిన బాలీవుడ్ మీడియా, పలువరు ప్రముఖులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తమిళ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న వెట్టువమ్ అనే సినిమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్లో స్టంట్‌మ్యాన్ మోహన్‌రాజ్ (52) మృతి చెందారు. తమిళనాడు నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు అకస్మాతుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. రాజు మృతి పట్ల చిత్రబృందంతో పాటు దర్శకుడు పా.రంజిత్ సంతాపం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై దర్శకుడు పా రంజిత్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్‌కమల్, వాహన యజమాని ప్రకాష్, షూట్ మేనేజర్ వినోద్‌లపై నిర్లక్ష్యం కింద కేసు నమోదైంది.
అయితే ఈ విషయం తెలిసిన అక్షయ్ కుమార్ వెంటనే ఇండస్ట్రీలో ఉన్న దాదాపు 650 మందికి ప్రమాద బీమా చేయించాడు. ఈ ఇన్సూరెన్స్ పాలసీలో స్టంట్మెన్లు పనిలో ఉన్నప్పుడు లేదా లేనప్పుడు గాయపడినా రూ.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు బీమా పొందవచ్చు. అలాగే ఒక స్టంట్‌మెన్ మరణిస్తే, నామినీకి రూ. 20-25 లక్షలు అందుతాయి. అక్షయ్ కుమార్ స్వయంగా ఈ బీమాకు నిధులు సమకూర్చారని, గత ఎనిమిది సంవత్సరాలుగా ఇది స్టంట్ కమ్యూనిటీకి ఎంతో సహాయపడిందని స్టంట్ కోఆర్డినేటర్లు తెలిపారు.