ప్రపంచానికి ఏ రకమైన ఆపద వచ్చినా.. కాపాడే సత్తా భారత్‌కు ఉన్నదని చెబుతున్నాడు బాలీవుడ్ టాప్‌హీరో అక్షయ్ కుమార్. తాజాగా, ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్.. దేశభక్తి, సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినప్పటి నుంచి.. దేశభక్తిని హైలైట్ చేస్తూ అనేక సినిమాలు తీశానని వెల్లడించాడు. ఈ తరహా చిత్రాలు హాలీవుడ్‌లోనూ అనేకం నిర్మించారనీ, ప్రపంచంలో ఏ మూల విషాదం ఉన్నా.. అమెరికన్లే నివారిస్తున్నట్టు అక్కడి సినిమాల్లో చూపిస్తున్నారని చెప్పుకొచ్చాడు. వాటి గురించి ఆలోచించడం వల్లే.. మనదేశం మరింత మెరుగ్గా ఉండగలదనే నిర్ణయానికి వచ్చాననీ, అందుకే దేశభక్తి సినిమాలను ఎక్కువగా తీసుకున్నానని అక్షయ్ కుమార్ తెలిపాడు. వీటిని చూసిన ప్రతిసారీ.. ‘నువ్వు ఎన్నిసార్లు దేశాన్ని కాపాడతావు?’ అంటూ తన భార్య ట్వింకిల్‌ఖన్నా తనను ఆట పట్టిస్తున్నదని అంటున్నాడు.
ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. “ప్రపంచానికి ఏదైనా పెద్ద ఇబ్బంది ఎదురైతే.. అంటే, ఉగ్రవాదుల దాడి, గ్రహాంతరవాసుల దాడి, ఆకాశం నుంచి పడిపోయే గ్రహశకలాలు.. ఇలాంటి ప్రమాదాలు ఎదురైతే.. అప్పుడు ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు? హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లంతా ‘అమెరికా’ అనే అంటారు. మరి మనదేశం ఏమి చేయగలదో మనకు తెలియదా? భారతదేశం ఎంతో చేయగలదు.
ప్రపంచానికి ఎలాంటి ఆపద ఎదురైనా కాపాడే శక్తి మన దేశానికి ఉన్నది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎయిర్ లిఫ్ట్, మిషన్ మంగళ్ వంటి చిత్రాలు.. ప్రత్యేకమైన భారతీయ కథలనీ, అవి పెద్దగా లాభాలు తెచ్చిపెట్టవని తెలిసినా తన హృదయం మాత్రం ఇలాంటి సినిమాలే చేయాలని చెబుతుందని వెల్లడించాడు. దేశం కోసం ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు.